NTV Telugu Site icon

Giorgia Meloni: ఉక్రెయిన్ యుద్ధాన్ని భారత్ పరిష్కరించగలదు.. ఇటలీ ప్రధాని కామెంట్స్..

Giorgia Meloni

Giorgia Meloni

Giorgia Meloni: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించడంలో భారత్ పాత్ర పోషిస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని శనివారం అన్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించడంలో భారత్, చైనా పాత్ర పోషించాలని కోరారు. ఉత్తర ఇటలీలోని సెర్నోబియో నగరంలోని అంబ్రోసెట్టి ఫోరమ్‌లో మెలోనీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వేదికగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోడిమిర్ జెలెన్‌స్కీతో ఆమె భేటీ అయ్యారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని నివారించడంలో భారత్ చేస్తున్న ప్రయత్నాలపై రష్యా అధినేత పుతిన్ వ్యాఖ్యానించిన రెండు రోజులు తర్వాత మెలోనీ నుంచి ఈ కామెంట్స్ వచ్చాయి.

గురువారం, వ్లాడివోస్టాక్‌లో జరిగిన 9వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్‌లో ప్రసంగిస్తూ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఉక్రెయిన్ సమస్యని పరిష్కరించడంలో భారత్ సహాయ హస్తం అందిస్తోందని అన్నారు. ‘‘మేము మా స్నేహితులను, భాగస్వాములను గౌరవిస్తాము, వారు ఈ సంఘర్షణకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధితో ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఇది ప్రధానంగా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, బ్రెజిల్, భారతదేశం. ఈ సమస్యపై మా సహోద్యోగులతో నేను నిరంతరం సంప్రదిస్తాను. ఈ దేశాల నాయకులు, వారితో మాకు నమ్మకమైన సంబంధం ఉందని, ఈ సంక్లిష్ట ప్రక్రియ యొక్క అన్ని వివరాలను అర్థం చేసుకోవడానికి హృదయపూర్వకంగా కృషి చేస్తారనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు’’ అని అన్నారు.

Read Also: Kolkata Doctor Case: ఆర్‌జీ కర్ మాజీ-ప్రిన్సిపాల్‌కి సన్నిహితంగా ఉన్న ముగ్గురు డాక్టర్లపై వేటు..

ఇటు రష్యా, అటు ఉక్రెయిన్‌తో ఏకకాలం స్నేహం చేసే దేశంగా భారత్‌కి పేరుంది. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చర్చలు, దౌత్య మార్గాల్లో సమస్యను పరిష్కరించుకోవాలని పదేపదే భారత్ నొక్కి చెప్పింది. ఇదిలా ఉంటే, ప్రధాని మోడీ మూడోసారి వరసగా అధికారం చేపట్టిన తర్వాత రష్యా, ఆ తర్వాత ఉక్రెయిన్ పర్యటనకి వెళ్లారు. ఈ సందర్భంగా యుద్ధ నివారణకు భారత్ శాంతి చర్చల్లో తన మిత్రులకు అండగా నిలుస్తుందని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ వివాదం సమయంలో న్యూ ఢిల్లీ తటస్థంగా లేదా ఉదాసీనంగా ప్రేక్షకుడిని కాదని, ఎల్లప్పుడూ శాంతి పక్షాన ఉంటుందని కైవ్‌లో ఒకేరోజు పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో అన్నారు. ఈ పర్యటన తర్వాత ప్రధాని మోడీ, పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడి తన పర్యటన వివరాలను పంచుకున్నారు. ప్రధాని మోడీ ప్రయత్నాలను వెస్ట్రన్ దేశాలతో పాటు అమెరికా అభినందించింది. ఈ సమస్యకు త్వరగా ముగింపు రావాలని ఆయా దేశాలు కాంక్షించాయి.