NTV Telugu Site icon

Waqf bill: వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ కమిటీని పొడగించే అవకాశం..?

Waqf Bill

Waqf Bill

Waqf bill: వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని మరింత కాలం పొడగించే అవకాశం కనిపిస్తోంది. వక్ఫ్ బిల్లులోని వివాదాస్పద ప్రతిపాదనల్ని సవరించేందుకు ఈ ఏడాది వర్షాకాల పార్లమెంటరీ సమావేశాల్లో కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది. బిల్లుపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేంద్రం జేపీసీని ఏర్పాటు చేసింది. కమిటీలో అధికార, ప్రతిపక్షాల ఎంపీలు భాగస్వాములుగా ఉన్నారు.

Read Also: EAGLE: గంజాయి, డ్రగ్స్ పై ఇక యుద్ధమే.. ఈగల్‌గా మారిన ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్

అయితే, ఈ కమిటీని పొడగించాలని ప్రతిపక్షాలు ఇప్పటికే కోరుతున్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే కూడా కమిటీ కాలాన్ని పొడగించాలని కోరినట్లు సంబంధిత వర్గాలు బుధవారం తెలిపాయి. కమిటీలోని అధికార, ప్రతిపక్ష ఎంపీలు వచ్చే ఏడాది జూలైలో జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వరకు పొడగించాలని తీర్మానించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి, ప్యానెల్ పదవి కాలాన్ని పొడగించాలని అభ్యర్థించిన ఒక రోజు తర్వాత నిషికాంత్ దూబే నుంచి ఈ ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగోయ్, టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీతో సహా ప్రతిపక్ష నాయకులు కమిటీ చైర్ పర్సన్ జగదాంబికా పాల్ నిర్ణీత గడువు అంటే, నవంబర్ 29లోగా ముగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రతిపాదిత వక్ఫ్ చట్టంలో అపరిమిత అధికారాలను కట్టడి చేయడంతో పాటు బోర్డులో మహిళా సభ్యులకు, ముస్లిమేతరులను కూడా చేర్చాలనే నిబంధన పెట్టారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.