NTV Telugu Site icon

Success Story: ఉద్యోగం పోవడమే వరంగా మారింది.. దీప్ సింగ్ చీమా సక్సెస్‌ స్టోరీ..

Success Story

Success Story

Success Story: కరోనా మహమ్మారి కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. అలాంటి వారిలో మొహబ్బత్ దీప్ సింగ్ చీమా కూడా ఒకరు. ఉద్యోగం పోవడంతో దీప్‌ సింగ్ చీమా(36) తన భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి తన సొంత రాష్ట్రం పంజాబ్‌కు తిరిగి వచ్చాడు. ధిల్వాన్‌లో తన సొంత ఫుడ్ ట్రక్ ‘ది పిజ్జా ఫ్యాక్టరీ’ని స్థాపించడానికి ఇదే మొదటి అడుగు అని కూడా అతనికి తెలియదు. తన ఉద్యోగాన్ని కోల్పోకపోతే మొహబ్బత్ దీప్ సింగ్ చీమా తన సొంత వ్యాపారం ప్రారంభించాలని ఎప్పుడూ ఆలోచించేవాడు కాదు. ఆ విధంగా ఉద్యోగం కోల్పోవడం అతనికి ఒక వరంగా మారింది. అది ఎలాగో తెలుసుకుందాం.

ఉద్యోగం పోయింది.. ఆలోచన పుట్టింది..
దీప్ సింగ్ చీమా పనిచేస్తున్నప్పుడు రూ.2.5 లక్షల జీతం వచ్చేది. ఆ ఆర్థిక భద్రతను హఠాత్తుగా కోల్పోవడంతో అతను ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కరోనా మహమ్మారి చాలా మంది ఉద్యోగాలను కొల్లగొట్టింది. 100 ఎకరాల భూమి ఉన్న ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన దీప్ సింగ్ చీమా వ్యవసాయం వైపు మొగ్గు చూపలేదు. మంచి పిజ్జా, బర్గర్‌లు అందించడానికి ధిల్వాన్‌లో ఎవరూ లేరని గ్రహించాడు.

ఇక్కడ నుంచే దీప్ సింగ్ చీమాకు ఫుడ్ ట్రక్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. 4 లక్షల తొలి పెట్టుబడితో ‘ది పిజ్జా ఫ్యాక్టరీ’ని ప్రారంభించాడు. జనాలు ముందు అతడిని ఎగతాళి చేసేవారు. ప్రారంభంలో కొన్ని నెలలు తీవ్రంగా శ్రమించాడు. చాలా మంది సమోసాలు, పకోడీలు తినడానికి అలవాటు పడ్డారు. ప్రేక్షకులకు కొత్త ఆహారాన్ని పరిచయం చేయడం కష్టం. కానీ దీప్ సింగ్ చీమా మనసు మార్చుకోలేదు. ప్రజలను ఆకర్షించేందుకు తన మెనూ ధరను రూ.199గా ఉంచాడు. ఈ ధరలో ఎవరైనా ఎన్ని పిజ్జాలు, బర్గర్లు, ఫ్రైస్ అయినా తినొచ్చు. స్కూల్‌కు వెళ్లే చిన్నతనంలో దీప్‌కి వంట చేయడం అంటే ఇష్టం, హోటల్ మేనేజ్‌మెంట్ చేయాలనుకున్నాడు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అతను మరో దారిని ఎంచుకోవలసి వచ్చింది.

ఇప్పుడు నెలకు రూ.2 లక్షలు
దీప్ కు వంట పట్ల ఉన్న మక్కువ ‘ది పిజ్జా ఫ్యాక్టరీ’తో మళ్లీ పుంజుకుంది. అతను తన వంట పరిజ్ఞానాన్ని చెఫ్ రణ్‌వీర్ బ్రార్‌ నుంచి నేర్చుకున్నాడు. ఈరోజు డీప్ ధిల్వాన్‌లో ఫుడ్ ట్రక్కులను తెరవడానికి చాలా మందిని ప్రేరేపించాడు. ఫుడ్ ట్రక్ వ్యాపారం గురించి సలహా పొందడానికి గోరఖ్‌పూర్ నుండి ప్రజలు అతని వద్దకు వచ్చేవారు. ధిల్వాన్ జంక్షన్‌ను ఇప్పుడు ‘పిజ్జా-బర్గర్ జంక్షన్’ అని పిలుస్తారు. ప్రస్తుతం దీప్‌ సింగ్ చీమా ప్రతి నెలా రూ.2 లక్షలు సంపాదిస్తున్నారు. ఎంతో మందికి అతను స్ఫూర్తిగా నిలిచాడు. ఉద్యోగం లేకపోయినా వ్యాపారం పెట్టుకుని జీవించవచ్చనే భరోసాను కల్పించాడు. అతని స్ఫూర్తితో చాలా మంది ఫుడ్ ట్రక్ బిజినెస్ చేస్తున్నారంటే అతిశయోక్తి లేదు.