Ranya Rao: రన్యా రావు వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి బంగారం అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. సినీ నటి కావడం, ఆమె సవతి తండ్రి కర్ణాటక డీజీపీ కావడంతో కేసు సంచలనంగా మారింది. అయితే, ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రన్యా రావును అరెస్ట్ చేసిన కొన్ని రోజుల తర్వాత, ఆమె సవతి తండ్రి, డీజీపీ(కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్) కె రామచంద్రరావుని ప్రభుత్వం తప్పనిసరి సెలవులో పంపింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల్లో ఎలాంటి కారణాన్ని పేర్కొనలేదు.
Read Also: Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీకి వియత్నాంలో ఏం పని..?’’ విదేశీ పర్యటనల్ని ప్రశ్నించిన బీజేపీ..
12 కోట్ల రూపాయల విలువైన 14.8 కిలోగ్రాముల బంగారాన్ని భారతదేశానికి అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై రన్యా రావును మార్చి 4, 2025న అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడింది. నడుము బెల్టులో బంగారాన్ని తరలిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) కనుగొంది. మొత్తం ఆమె నుంచి రూ. 17.29 కోట్ల విలువైన బంగారం, నగదుని స్వాధీనం చేసుకున్నారు. రన్యా రావు దాదాపుగా 30 సార్లు దుబాయ్‌కి వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. ప్రతీ సందర్భంలోనూ ఆమె పెద్ద మొత్తంలో బంగారం స్మగ్లింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆమె అక్రమంగా తరలించే ప్రతీ కిలో బంగారానికి లక్ష రూపాయాలు సంపాదించిందని, ఒక్కో ట్రిప్పుకు రూ. 12-13 లక్షలు సంపాదించేదని తెలిసింది.