Abhishek Banerjee:అభిషేక్ దాడి వెనుక బీజేపీనా? టీఎంసీనా? బెంగాల్‌లో కొత్త రాజకీయ తుఫాన్

  • బెంగాల్‌లో బీజేపీ వర్సెస్ టీఎంసీ..
  • ఎంపీ అభిషేక్ బెనర్జీ దాడితో రాజకీయ ఉద్రిక్తత..
  • టీఎంసీ అంతర్గత పోరు ఫలితమే ఈ దాడి అని బీజేపీ ఆరోపణ..
  • దాడి వెనక బీజేపీ ఉందని టీఎంసీ వాదన..
Abhishek Banerjee

Abhishek Banerjee

Abhishek Banerjee: మమతా బెనర్జీ మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అయిన అభిషేక్ బెనర్జీపై దాడి అంశం బెంగాల్ రాజకీయాల్లో ఉద్రిక్తత పెంచింది. శనివారం సోనార్‌పూర్‌లో టీఎంసీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో అభిషేక్‌పై స్థానికులు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. అయితే, తనపై దాడి చేసింది బీజేపీనే అని ఆయన ఆరోపిస్తున్నారు. మమతా బెనర్జీ బీజేపీపై విమర్శలు చేస్తూ.. పాలకులు హంతకులుగా మారారని అన్నారు. ఈ వ్యవహారం బీజేపీ వర్సెస్ టీఎంసీగా మారింది.

ఇదిలా ఉంటే, బీజేపీ మాత్రం అభిషేక్‌పై దాడి ఘటన టీఎంసీ అంతర్గత వర్గపోరు ఫలితమే అని చెబుతోంది. దాడికి సంబంధించి అరెస్ట్ అయిన ఆరుగురు వ్యక్తులు ఇటీవల వరకు మాజీ టీఎంసీ ఎమ్మెల్యే లవ్లీ మైత్రాకు సన్నిహితులని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్య ఆరోపించారు. ఈ ఘటనకు తృణమూల్ కాంగ్రెస్ అంతర్గత పోరు వలన జరిగిందే అని ఆయన అన్నారు.

×
×
Ad

అయితే, బీజేపీ ఆరోపణల్ని టీఎంసీ ఖండించింది. దాడి రోజు బీజేపీ మండల అధ్యక్షుడు అభిజిత్ బిస్వాస్ సంఘటనా స్థలంలో ఉన్నారని, అతనే ప్రజల్ని రెచ్చగొట్టారని టీఎంసీ ఒక ఫోటోను రిలీజ్ చేసింది. దాడి చేసిన వారిలో ఒకరిని ఆకాష్ గాయన్‌గా గుర్తించారు, అతను బీజేపీ కార్యకర్త అని టీఎంసీ ఆరోపించింది. ప్రజల్ని పక్కదారి పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని టీఎంసీ చెబుతోంది.