పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది… త్రిపురలో పర్యటిస్తున్నారు అభిషేక్ బెనర్జీ.. అయితే, ఆయన కాన్వాయ్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడికి పాల్పడ్డారు.. వారు బీజేపీ జెండాలను పట్టుకుని ఉన్నారు.. అయితే, తనపై దాడికి పాల్పడింది బీజేపీ నేతలేనంటూ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు అభిషేక్ బెనర్జీ.. బీజేపీ నాయకత్వంలోని త్రిపురలో ప్రజాస్వామ్యం ఇలా ఉంది అంటూ మండిపడ్డ ఆయన.. విప్లవ్ దేవ్ మీరు రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు.. మిమ్మల్ని అభినందిస్తున్నాను.. అంటూ సీఎంపై సెటైర్లు వేస్తూ.. తన కాన్వాయ్‌పై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను పోస్టు చేశారు అభిషేక్ బెనర్జీ.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయిన అభిషేక్ బెనర్జీని.. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు మమతా బెనర్జీ.. అయితే.. పార్టీ సంస్థాగత సమావేశంలో పాల్గొనడానికి త్రిపురవెళ్లిన ఆయన.. త్రిపురేశ్వరి ఆలయంలో ప్రార్థనలు చేసి తిరిగి వెళ్తుండగా ఆయన కారుపై దాడి జరిగినట్టు చెబుతున్నారు.. తన ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలైనట్టు తెలిపారు. పార్టీ సమావేశానికి వెళ్లకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.. కాగా, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఎన్నికల సమయంలో.. ఆ తర్వాత కూడా పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో టీఎంసీ, బీజేపీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు.
