NTV Telugu Site icon

AAP: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో పోటీపై ఆప్ నిర్ణయమిదే..!

Kejriwal

Kejriwal

దేశంలో మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవలే హర్యానా, జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. త్వరలో మహారాష్ట్ర, జార్ఖండ్‌లో జరగనున్నాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ.. హర్యానా, జమ్మూకాశ్మీర్‌లో పోటీ చేసి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయింది. ఒక్క జమ్మూకాశ్మీర్‌లో మాత్రం ఒక సీటును మాత్రం గెలిచింది. అయితే మహారాష్ట్ర, జార్ఖండ్‌లో పోటీపై ఆప్ సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది.

మహారాష్ట్రలో ఆప్‌కు అంత కేడర్ లేదు. అంత ఫాలోయింగ్ కూడా లేదు. ఇప్పటికే హర్యానాలో ఒంటరిగా పోటీ చేసి దెబ్బతింది. ఈ నేపథ్యంలో బరిలోకి దిగి ఇబ్బందులు పడే కంటే ఇండియా కూటమి అభ్యర్థులకే మద్దతు ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే రెండు రాష్ట్రాల్లో పోటీ చేయకుండా కూటమి అభ్యర్థులకు సపోర్టు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశం ఉన్నందున ఓటర్లలో గందరగోళం సృష్టించకూడదనే ఉద్దేశంతో మహారాష్ట్రలో పోటీకి దూరంగా ఉండాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లో పరిస్థితిని అంచనా వేశాకే తాము ఈ నిర్ణయానికి వచ్చామని సీనియర్ నేత ఒకరు తెలిపారు. ఈ ఏడాది మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో, జార్ఖండ్‌లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. జార్ఖండ్‌లో మొదటి దశ పోలింగ్ నవంబర్ 13న, రెండో దశ నవంబర్ 20న జరగనుంది. రెండు రాష్ట్రాల ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి.

ఆమ్ ఆద్మీ పార్టీ 2019లో కూడా మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో పోటీ చేసింది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాల్లో 24 స్థానాల్లో బరిలో నిలవగా 23 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. జార్ఖండ్‌లోని 81 స్థానాలకు గానూ ఆ పార్టీ 26 స్థానాల్లో పోటీ చేయగా అభ్యర్థులందరూ డిపాజిట్లు కోల్పోయారు. ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో 90 స్థానాలకుగాను 89 చోట్ల పోటీ చేసిన ఆప్ కేవలం 1.53 ఓట్ల శాతం మాత్రమే సాధించి డిపాజిట్లు పోగొట్టుకుంది.