Site icon NTV Telugu

Delhi: ఢిల్లీలో లోక్‌సభ అభ్యర్థుల్ని ప్రకటించిన ఆప్.. ప్లాన్ ఇదేనా?

Kejriwal Lok Shabha Candite

Kejriwal Lok Shabha Candite

దేశ రాజధాని ఢిల్లీ ఆప్‌కు (AAP) బీజేపీకి (BJP) ఎంతో కీలకమైంది. ఇక్కడ మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలన్నీ ప్రస్తుతం కమలం చేతిలోనే ఉన్నాయి. ఈసారి ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఆప్ తీవ్ర కసరత్తు చేసింది. ఇందులో భాగంగానే తాజాగా నలుగురు లోక్‌సభ అభ్యర్థులను ( Lok Sabha Polls Candidates) ముఖ్యమంత్రి కేజ్రీవాల్ (Kejriwal) ప్రకటించారు. అయితే ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఢిల్లీలో అవకాశం కల్పించారు. ఈ ముగ్గురు ఢిల్లీలో కీలకమైన నేతలు కావడం విశేషం. దీంతో ఎలాగైనా ఆ స్థానాలను కైవసం చేసుకోవాలన్న ఆలోచనతోనే సిట్టింగ్‌లు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే హర్యానాలో ఒక పార్లమెంట్ స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీకి నలుగురు, హర్యానాలో ఒకరిని ప్రకటించింది. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఆప్ ప్రకటించిన 4 లోక్‌సభ అభ్యర్థుల్లో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలే కావడం విశేషం.

ఇండియా కూటమిలో భాగంగా ఢిల్లీలో ఉన్న ఏడు స్థానాల్లో నాలుగు ఆప్‌కు, కాంగ్రెస్‌కు మూడు స్థానాలు కేటాయించారు. తాజాగా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఢిల్లీలో ఆప్ న్యూఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టింది.

న్యూఢిల్లీకి సోమనాథ్ భారతి. మాల్వియా నగర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పశ్చిమ ఢిల్లీకి మహాబల్ మిశ్రా. కొండ్లి అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇక తూర్పు ఢిల్లీ నుంచి కుల్దీప్ కుమార్. తుగ్లకాబాద్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సహిరామ్ దక్షిణ ఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.

2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు ఈ స్థానాలు ఆప్‌కి చాలా కీలకం. ఇక హర్యానాలోని కురుక్షేత్ర నుంచి సుశీల్ గుప్తాను నిలబెట్టింది.

ఇక పంజాబ్‌లో మాత్రం ఆప్ ఒంటరిగా పోటీ చేస్తోందని ఇప్పటికే ప్రకటించింది. గుజరాత్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Exit mobile version