దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అధికార-ప్రతిపక్ష నేతల విమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇక సమయం తక్కువగా ఉండడంతో అగ్ర నేతలంతా ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆప్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
ఇది కూడా చదవండి: Maharashtra: ఒకే వేదికపై అజిత్ పవార్-శరద్ పవార్.. ఆసక్తి రేపిన సంఘటన
పదేళ్ల ఢిల్లీ పాలనలో ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిలో అన్ని రికార్డ్‌లు సృష్టించిందని నడ్డా ధ్వజమెత్తారు. ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో ఓ బహిరంగ సభలో నడ్డా మాట్లాడారు. కేజ్రీవాల్ ఎంతో అమాయకంగా నటిస్తూ అబద్ధాలు చెబుతారని విమర్శించారు. ఈ విషయంలో పోటీ పెడితే ఆయన్ని ఎవరూ అధిగమించలేరని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో ఢిల్లీలో అభివృద్ధి ఏమైనా జరిగిందంటే.. అది మోడీ వల్లేనన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఆప్‌కి తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. నూతన మద్యం విధానం పేరుతో ఆప్ ప్రభుత్వం ఢిల్లీ ప్రజల జేబులకు కన్నం పెట్టిందని విమర్శించారు. ఈ ఎన్నికలు ఢిల్లీ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని ప్రజలకు సూచించారు.
ఇది కూడా చదవండి: ED: ఈడీ కీలక చర్యలు.. రూ.1.26 కోట్ల విలువైన మంత్రి ఆస్తులు జప్తు..
దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మరోసారి అధికారం కోసం ఆమ్ ఆద్మీ ప్రయత్నిస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ట్రై చేస్తోంది. ఇలా రెండు పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైట్ సాగుతోంది. ఇప్పటికే రెండు పార్టీలు పోటాపోటీగా మేనిఫెస్టోలు ప్రకటించాయి.
ఇది కూడా చదవండి: Maharashtra: బడ్జెట్ సమావేశాలకు ముందు ఉద్ధవ్ థాక్రేకు భారీ షాక్..! మహాయుతిలోకి పలువురు ఎంపీలు!