NTV Telugu Site icon

Toilet Tax: హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ‘‘టాయిలెట్ ట్యాక్స్’’ గందరగోళం..

Sukhu

Sukhu

Toilet Tax: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ‘‘ టాయిలెట్ ట్యాక్స్’’ సంచలనంగా మారింది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై టాయిలెట్ ట్యాక్స్ విధిస్తుందనే వార్తల నేపథ్యంలో గందరగోళం నెలకొంది. అయితే, దీనిపై సీఎం సుఖ్వీందర్ సుఖూ స్పందించారు. రాష్ట్రొలో అలాంటి ట్యాక్స్ ఏం లేదని సమాధానం ఇచ్చారు. హిమాచల్ ప్రభుత్వం పట్టణ నివాసితులపై ప్రతీ టాయ్‌లెట్ సీటుకి రూ. 25 పన్ను విధిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నివేదికలన్నీ కూడా నిరాధారమైనవిగా సుఖూ పేర్కొన్నారు. రూ. 100 వాటర్ ఛార్జీలో ‘ టాయిలెట్ పన్ను’ ప్రతీ నివాసానికి 25 శాతంగా ఉంటుందని నివేదిక పేర్కొంది.

Read Also: Hydrogen Train: త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు.. ఏ ఏ మార్గాల్లో నడవనుందంటే..?

పట్టణ భవనంలో టాయిలెట్ సీట్ల సంఖ్య ఆధారంగా ఛార్జీలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందన్న ఆరోపణలపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి స్పందిస్తూ, అలాంటి అదనపు సెస్ విధించలేదని చెప్పారు. టాయిలెట్ ట్యాక్స్ గురించి మీడియాలో కథనాలు రావడంతో ఒక్కసారిగా రాజకీయ గందరగోళం నెలకొంది. “ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్ 21న జారీ చేయబడింది. మురుగునీటి పారుదల ఛార్జీలకు సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్ అదే రోజు ఉపసంహరించబడింది. దీనిపై డిప్యూటీ సీఎం తరఫున అభ్యంతరం వ్యక్తం చేశారు. సిమ్లాలో ఇప్పటికే మురుగునీటి ఛార్జీలు వసూలు చేయబడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో, ఇది హోటళ్లు మరియు కొన్ని సంస్థలకు వర్తిస్తుంది. త్వరలో కొత్త నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు’’ అని హిమాచల్ ప్రదేశ్ అదనపు ప్రధాన కార్యదర్శి ఓంకార్ శర్మ తెలిపారు.

అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విరుచుకుపడింది. ఈ పన్నుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు వివిధ బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘నమ్మలేనిది, ఇదే నిజమైతే! పీఎం (నరేంద్ర) మోడీ జీ స్వచ్ఛతను ప్రజా ఉద్యమంగా నిర్మిస్తుండగా, ఇక్కడ కాంగ్రెస్ ప్రజలు మరుగుదొడ్ల కోసం పన్నులు వేస్తున్నారు! వారి కాలంలో వారు మంచి పారిశుధ్యం అందించనందుకు సిగ్గుపడాలి, కానీ ఈ చర్య దేశం సిగ్గుపడుతుంది.’’ అని నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ కూడా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రజలపై నిరంతరం కొత్త పన్నులు, ఆంక్షలు విధిస్తోందని మండిపడ్డారు. ఇది హిమాచల్ ప్రభుత్వ ఆర్థిక దివాలా, విధానపరమైన దివాలా, మానసిక దివాలాను ప్రతిబింబిస్తోందని అన్నారు.