DMK: తమిళనాడు రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార డీఎంకే, బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. తాజాగా డీఎంకే వివాదాస్పద నేత ఏ.రాజా ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. భారత తొలి సీడీఎస్ దివంగత జనరల్ బిపిన్ రావత్ మరణానంతరం ప్రధాని నీలగిరిని సందర్శించలేదని అన్నారు. హెలికాప్టర్ కూలిన ప్రదేశాన్ని సీఎం స్టాలిన్ సందర్శించారని, ప్రధాని మోడీ మాత్రం రాలేదని అన్నారు. కానీ, ఆయన ఓట్లు అడిగేందుకు మాత్రం నీలగిరికి వస్తున్నారంటూ దుయ్యబట్టారు.
Read Also: PM Modi: గత 10 ఏళ్లు కేవలం ట్రైలర్ మాత్రమే.. అసలు కథ ముందుంది..
డీఎంకే పార్టీ తరుపున నీలగిరి నుంచి రాజా పోటీ చేస్తున్నారు. హెలికాప్టర్ ప్రమాదం తెలుసుకున్న తర్వాత సీఎం స్టాలిన్ ఘటనాస్థలానికి చేరుకున్నారని అన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన బిపిన్ రావత్, అతని భార్య, 11 మంది ఇతర సిబ్బందికి నివాళులు అర్పించారని చెప్పారు.‘‘ త్రివిధ దళాల అధిపతి చనిపోయారు. ప్రధానమంత్రి లేదా రక్షణ మంత్రి ఇక్కడికి వచ్చారా.? బిపన్ రావత్ ఇక్కడ మరణిస్తే మీరు ఢిల్లీలో ఏ ముఖ్యమైన పని ఉంది..? మీరు విదేశాల్లో ఉన్నారా.?, కానీ సీఎం స్టాలిన్ ఇక్కడకు వచ్చి నివాళులు అర్పించారు. మాకు దేశభక్తి లేదని చెప్పకంది. మాకు హిందీ రాదు.. మోడీ మాకు దేశభక్తి నేర్పాల్సిన అవసరం లేదు’’ అని బుధవారం నీలగిరిలో జరిగి ప్రచారంలో రాజా అన్నారు. బీజేపీ దేశభక్తి మతం కోసం, భాష కోసం అని ఆరోపించారు. ఇలాంటి దేశభక్తిని తమిళనాడు సమర్థించడని అన్నారు. తమిళనాడులోని 39 ఎంపీ స్థానాలకు ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి.
అప్పటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులికా రావత్, మరో 11 మంది వైమానిక దళానికి చెందిన Mi-17V5 ఛాపర్‌లో ప్రయాణిస్తుండగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అందులోని వారంతా మరణించారు. డిసెంబర్ 8, 2021న తమిళనాడులోని కూనూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
