Students Died Abroad: ఇటీవల కాలంలో పలు ప్రమాదాల్లో, అనారోగ్య సమస్యలతో పలువురు భారతీయ విద్యార్థులు విదేశాల్లో మరణిస్తున్నారు. తమ బిడ్డలు ప్రయోజకులు అవుతారని ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు విదేశాలకు పంపుతున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో పేరెంట్స్‌కి కన్నీటిని మిగులుస్తున్నారు. రోడ్డు యాక్సిడెంట్లు, దుండగుల చేతిలో మరణించడం, ఆరోగ్య సమస్యలు కారణంగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి.
2018 నుండి మొత్తం 403 భారతీయ విద్యార్థులు మరణించిన సంఘటనలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఈ మరణాలు ఎక్కువగా కెనడాలోనే చోటు చేసుకున్నాయి. 91 మంది విద్యార్థులు కెనడాలోనే మరణించారు. యూకేలో 48 మరణాలతో రెండో స్థానంలో ఉంది. ఈ వివరాలను శుక్రవారం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభకు అందించింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. భారతీయ విద్యార్థుల సంక్షేమం తమ ప్రభుత్వ ప్రాధాన్యతలో ఒకటని ఆయన చెప్పారు.
మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. సహజ కారణాలు, ప్రమాదాలు, ఇతర వైద్య పరిస్థితుల కారణాల వల్ల 2018 నుంచి 403 మంది భారత విద్యార్థులు మరణించారని జైశంకర్ వెల్లడించారు. కెనడాలో 91 మంది, బ్రిటన్‌లో 48 మంది, రష్యాలో 40 మంది, అమెరికాలో 36 మంది, ఆస్ట్రేలియాలో 35 మంది, ఉక్రెయిన్‌లో 21 మంది, జర్మనీలో 20 మంది భారతీయ విద్యార్థులు మరణించినట్లు డేటా వెల్లడించింది. సైప్రస్‌లో 14 మంది భారతీయ విద్యార్థులు, ఫిలిప్పీన్స్ మరియు ఇటలీలో 10 మంది చొప్పున, ఖతార్, చైనా మరియు కిర్గిజ్‌స్థాన్‌లలో తొమ్మిది మంది చొప్పున భారతీయ విద్యార్థులు మరణించారు.