NTV Telugu Site icon

Panipuri: పానీపూరి తిని 40 మంది పిల్లలకు అస్వస్థత

Pani Puri

Pani Puri

Panipuri: ఇటీవల కాలంలో పిల్లలు, పెద్దలు చిరుతిళ్లకు అలవాటుపడి అనారోగ్యం పాలవుతున్నారు. కొన్నిసార్లు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో చికెన్ షవార్మా లాంటి పదార్థాలు తిని ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోయినవారు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో పానీపూరి తిని ఏకంగా 40 మంది చిన్నారులు, 10 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

జార్ఖండ్ లోని కోడెర్మాలో రోడ్డు పక్కన వ్యాపారి నుంచి పానీపూరి తిన్న తర్వాత ఫుడ్ పాయిజనింగై 50 మంది అస్వస్థతలకు గురయ్యారని ఆరోగ్య అధికారులు శనివారం వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం లోకై పంచాయతీ పరిధిలోని గోసైన్ తోలా వద్ద పానీపూరీ తిన్నట్లు అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెల్లడించారు.

Read Also: KA Paul: 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి.. రూ. 40 లక్షలు ఖర్చు చేయండి..!

పానీ పూరి తిన్న తర్వాత పిల్లలకు, మహిళలకు వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు ఎదుర్కొన్నారని, బ్యాక్టీరియ ఇన్ఫెక్షన్ వల్ల బాధపడుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. బాధితులను కోడెర్మాలోని సదర్ ఆస్పత్రికి తరలించారు. 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. పిల్లలు 9 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్నవారే అని అధికారులు తెలిపారు. పానీపూరి వ్యాపారుల నుంచి మిగిలిన ఆహార పదార్థాలను పరీక్షల నిమిత్తం రాంచీకి పంపినట్లు తెలిపారు.