NTV Telugu Site icon

Jammu Kashmir: జమ్మూలో 35-40 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు.. భద్రత కట్టుదిట్టం..

Jammu Kashmir

Jammu Kashmir

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలు పెరిగాయి. ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన రోజే ఉగ్రవాదులు యాత్రికులు బస్సుపై దాడికి తెగబడ్డారు. రియాసిలో జరిగిన ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వరస రోజుల్లో కథువా, దోడా జిల్లాల్లో ఉగ్రవాద ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ప్రధాని నరేంద్రమోడీ కేంద్రపాలితప్రాంతంలో భద్రత పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇతర ఉన్నతాధికారులతో హై లెవల్ మీటింగ్ నిర్వహించారు.

Read Also: Parliament Sessions: సోమ, మంగళవారాల్లో ఎంపీల ప్రమాణం.. స్పీకర్‌ ఎంపికపై ఉత్కంఠ

ఇదిలా ఉంటే, గత కొన్ని రోజులుగా భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల వేట కొనసాగిస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాలు, కొండలు, లోయలు సెర్చ్ ఆపరేషన్‌కి సంక్లిష్టంగా మారాయి. జమ్మూ ప్రాంతంలోని రాజౌరీ, పూంచ్, కథువా సెక్టార్లలో 35-40 మంది విదేశీ ఉగ్రవాదులు క్రియాశీలకంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ మూలాలు తెలియజేస్తున్నాయి. ప్రధానంగా పాకిస్తాన్‌కి చెందిన ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పెంచే ప్రయత్నంలో స్థానిక గైడ్‌లు, సపోర్ట్ నెట్వర్క్‌ల సాయంతో చిన్న బృందాలుగా పనిచేస్తున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి.

ఈ ఉగ్రవాదులు 2-3 గ్రూపులుగా పనిచేస్తున్నారని, స్థానిక సహాయక వ్యవస్థలో బాగా కలిసిపోయారని భద్రతా వ్యవస్థలోని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మిలిటరీ, ఇతర భద్రతా సంస్థలు తమ గూఢచార కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. సరిహద్దుల్లో చొరబాటు ప్రయత్నాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ సరిహద్దును పర్యవేక్షించడం, ఉగ్రవాద వ్యతిరేక గ్రిడ్ ఏర్పాటు చేయడం, ఉగ్రవాదులకు సాయం చేస్తున్న స్థానికుల నెట్వర్క్‌ని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత సైన్యం ఇప్పటికే 200కి పైగా సాయుధ రక్షిత వాహనాలతో కూడిన అదనపు బలగాలను మోహరించాయి.