Heavy Rains: హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. ఆకస్మిక వరదలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. ఇటు ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోనూ వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో శనివారం 33 మంది మరణించారు.
హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు రావడంతో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సహా మొత్తం 22 మంది చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలకు సంబంధించిన ఘటనల్లో 10 మంది గాయపడగా, మండీలో ఆరుగురు గల్లంతయ్యారని డిప్యూటి కమిషనర్ అరిందమ్ చౌదరి వెల్లడించారు.
ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా నలుగురు మృతి చెందగా, 10 మంది గల్లంతయ్యారు. నదులు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో పాటు వంతెనలు కొట్టుకుపోవడంతో పలు గ్రామాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Extortion Scam: రూ.500 కోట్ల ఇన్‌స్టంట్ రుణాల కుంభకోణం.. తెర వెనుక చైనా ప్రమేయం
ఒడిశాలోని 500 గ్రామాలలో దాదాపు 4.5 లక్షల మంది ప్రజలు ఇప్పటికే వరదలతో అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో, నలుగురు మరణించినట్లు అధికారులు నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం మయూర్‌భంజ్, కేంద్రపారా మరియు బాలాసోర్‌తో సహా పలు జిల్లాల్లో రెస్క్యూ, రిలీఫ్ టీమ్‌లను మోహరించింది. శనివారం మహానదిలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన పడవలో 70 మంది సురక్షితంగా బయటపడ్డారు.
భారీ వర్షం కారణంగా జార్ఖండ్‌లోని పలు జిల్లాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పశ్చిమ సింగ్‌భూమ్‌లో తన ఇంటి మట్టి గోడ ఆమెపై పడటంతో ఒక మహిళ మరణించగా, రామ్‌గఢ్ జిల్లాలో ఉబ్బిన నల్కారి నదిలో ఇద్దరు వ్యక్తులు మునిగిపోయారు.
జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో వైష్ణో దేవి యాత్ర ఈ ఉదయం తిరిగి ప్రారంభమైంది. భారీ వర్షం కారణంగా తీర్థయాత్రకు వెళ్లే దారిలో వరదలు బీభత్సం సృష్టించడంతో రాత్రిపూట యాత్ర తాత్కాలికంగా నిలిపివేయబడింది. ఆదివారం పశ్చిమ మధ్యప్రదేశ్‌లో, సోమవారం తూర్పు రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.