NTV Telugu Site icon

Bangladesh clashes: బంగ్లాదేశ్ ఘర్షణల్లో 32 మంది మృతి.. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ..

Bangladesh Clashes

Bangladesh Clashes

Bangladesh clashes: బంగ్లాదేశ్ వ్యాప్తంగా మరోసారి ఘర్షణలు చెలరేగాయి. ఇటీవల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు, ప్రజలు ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో 200 మందికి పైగా మృతి చెందారు. ఇదిలా ఉంటే పోలీసులు అణిచివేతకు వ్యతిరేకంగా మరోసారి ఆ దేశంలో నిరసనలు మిన్నంటాయి. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్‌తో నిరసనకారులు రోడ్డెక్కారు. రాజధాని ఢాకాలో నిరసనకారులు, విద్యార్థులు పోలీసులకు, అధికార అవామీ లీగ్‌ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 32కి మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు.

Read Also: Dowry harassment: ఆఫ్రికా వ్యక్తితో పడుకోవాలని భార్యపై ఒత్తిడి.. కట్నం కోసం భర్త దురాగతం..

నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, స్టన్ గ్రెనేడ్లను ప్రయోగించారు. ఘర్షణలు ఎక్కువ అవుతుండటంతో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూని ప్రకటించారు. మరోవైపు ఘర్షణలు ఎక్కువ అవుతుండటంతో ఆ దేశంలో ఉంటున్న భారతీయులు అలర్ట్‌గా ఉండాలని భారత్ సూచించింది. బంగ్లాదేశ్ ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మద్దతు ఉన్న విద్యార్థులు శాసనోల్లంఘనకు పిలుపునిచ్చారు. ప్రజలు పన్నులు చెల్లించొద్దని సూచించారు. ఢాకాలోని షాబాగ్ ప్రాంతంలోని ప్రధాన ఆస్పత్రి అయిన బంగబంధు షేక్ ముజీబ్ మెడికల్ యూనివర్సిటీతో సహా పలు కార్యాలయాలపై నిరసనకారులు దాడులుకు పాల్పడ్డారు. ఢాకా ఉత్తర ప్రాంతలో బాంబు దాడులు కూడా జరిగాయి. ప్రభుత్వం హైస్పీడ్ ఇంటర్నెట్ సేవల్ని నిలిపేసింది. 4జీ సేవల్ని నిలిపేయాలని ఆదేశాలు అందాయి.

మరోవైపు ఈ నిరసనలకు జమాలే ఇస్లామీ పార్టీ, వారి విద్యార్థి విభాగం కారణమని ప్రభుత్వం నిందించింది. ఇలా రోడ్లపైకి వచ్చే వారు విద్యార్థులు కారని, దేశాన్ని అస్థిరపరిచే ఉగ్రవాదులు అంటూ పీఎం షేక్ హసీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉగ్రవాదుల్ని బలంగా అణిచివేయాలని దేశ ప్రజలను కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో 1971 బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాట కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంపై ఆ దేశంలో ఆందోళనలు చెలరేగాయి. అయితే, సుప్రీంకోర్టు దీనిని 5 శాతానికి తగ్గించడంతో అల్లర్లు సద్దుమణిగాయి. అయితే, ఇప్పుడు పీఎం హసీనా రాజీనామా చేయాలనే కొత్త నినాదంలో మళ్లీ నిరసనలు ప్రారంభయ్యాయి.

Show comments