NTV Telugu Site icon

Haryana: హర్యానాలో బీజేపీకి షాక్.. ప్రభుత్వానికి “చేయి”చ్చిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు..

Haryana

Haryana

Haryana: హర్యానా బీజేపీకి షాక్ తగిలింది. సీఎం నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. హర్యానా మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా, పీసీసీ చీఫ్ం ఉదయ్ భాన్ సమక్షంలో ముగ్గురు ఎమ్మెల్యేలు సోంబీర్ సాంగ్వాన్, రణధీర్ గొల్లెన్, ధరంపాల్ గొండర్ ఈ విషయాన్ని వెల్లడించారు. రైతులకు సంబంధించి ఆందోళనతో పాటు పలు సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

Read Also: EC: వివాదాస్పద బీజేపీ పోస్టును తొలగించండి.. ఎక్స్‌ని కోరిన ఎలక్షన్ కమిషన్..

సైనీ ప్రభుత్వంలో వీరు చేరకపోవడంతో అసంతృప్తిగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం మ్యాజిగ్ ఫిగర్ కోల్పోయిందని వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ప్రస్తుత బలం 88 కాగా, అందులో బీజేపీకి 40 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. గతంలో బీజేపీకి సపోర్టు చేసిన జేజేపీ ఇటీవల తన మద్దతు ఉపసంహరించుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల షేరింగ్‌ విభేదాల కారణంగా బీజేపీ-జేజేఎం పొత్తు బీటలు వారింది.

నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వం ఇప్పుడు మైనారిటీలో పడిందని, ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని, సైనీకి ఒక్క నిమిషం కూడా ఆ పదవిలో ఉండే హక్కు లేదని పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్ అన్నారు. వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలపై సీఎం సైనీ విరుచుకుపడ్డారు, కాంగ్రెస్ కొందరి కోరికలను మాత్రమే నెరవేరుస్తోందని ప్రజలతో ఎలాంటి సంబంధం లేదని ఆరోపించారు.

Show comments