Site icon NTV Telugu

Himachal Pradesh: హిమాచల్‌లో ‘‘క్లౌడ్ బరస్ట్’’.. మెరుపు వరదలు..

Floods

Floods

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ ‌లో కులులో బుధవారం మూడు ‘‘క్లౌడ్ బరస్ట్’’ చోటు చేసుకున్నాయి. దీంతో ఒక్కసారిగా మెరుపు వరదలు ఆ ప్రాంతాలను ముంచెత్తాయి. కీలక రహదారులు ఎక్కడికక్కడ స్తంభించి పోయాయి. సైన్జ్, గడ్సా, సోలాంగ్ నాలాలో కుండపోత వర్షాలు నమోదయ్యాయి. దీంతో జీవ నాలా ప్రవాహం అకస్మాత్తుగా పెరిగింది. స్థానిక ప్రజల్ని అధికారులు హెచ్చరించారు. ఆకస్మిక వరద కారణంగా నదులు మరియు వాగులు ఉప్పొంగి ప్రవహించాయి.

Read Also: Tejeshwar Murder: గద్వాల మర్డర్ కేసు.. చదివింది పది వరకే.. కన్నింగ్ ప్లాన్స్‌లో మాత్రం పీహెచ్‌డీ

ఇప్పటి వరకు వరదల్లో ఏడు నుంచి 10 మంది వరకు తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు. కాంగ్రాలోని ఖనియారా గ్రామంలోని సంఘటనా స్థలానికి అత్యవసర సహాయక సిబ్బంది, జిల్లా పరిపాలన అధికారులు, పోలీసు సిబ్బంది చేరుకున్నారు, ఇద్దరు మృతదేహాలను వెలికితీశారు. ఆకస్మిక వరదల బారిన పడిన వారి సంఖ్య ఇంకా తెలియదని అధికారులు తెలిపారు.

తక్కువ సమయంలో భారీ వర్షం సంభవించడంతో కులు జిల్లా అంతటా భారీ వరదలు ఏర్పడ్డాయి. కులు జిల్లాను కలిపే ప్రధాన రహదారి ఔట్-లుహ్రి-సైంజ్ జాతీయ రహదారిని మూసేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రాబోయే 48 గంటల్లో హిమాచల్ అంతటా అతి భారీ వర్షాలు సంభవిస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాంగ్రా, మండి, సిమ్లా, సిర్మౌర్, కులు, హమీర్‌పూర్, సోలన్, ఉనాతో పాటు అనేక జిల్లాలకు వర్ష హెచ్చరికలు చేశారు. పన్హో ఆనకట్ట నుండి బియాస్ నదిలోకి నీటిని విడుదల చేయడం గురించి హెచ్చరికలు జారీ చేశారు. పర్యాటకులు, స్థానిక ప్రజలు బియాస్ నది నుండి దూరంగా ఉండాలని సూచించారు.

Exit mobile version