BJP: 2024 లోక్‌సభ ఎన్నికలకు మరెంతో కాలం లేదు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావాలని అనుకుంటుంటే.. ప్రధాని మోడీని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ తో పాటు 26 పార్టీలు ఇండియా పేరుతో కొత్త కూటమి కట్టాయి.
ఇదిలా ఉంటే ముంబై వేదికగా రేపు, సెప్టెంబర్ 1న ఇండియా కూటమి తన మూడో సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఇండియా కూటమికి ప్రతిగా బీజేపీ వినూత్న ప్రచారం చేపట్టింది. ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ నటించిన ‘టెర్మినేటర్’ సినిమాతో ప్రధాని మోడీకి బీజేపీ ప్రచారం చేస్తోంది. మోడీ ఫోటోను పెట్టి, సినిమాలోని డైలాగ్ ని తలపించేలా..‘‘2024! నేను తిరిగి వస్తాను!’’ అంటూ పోస్టర్ ని బీజేపీ ట్వీట్ చేసింది.
Read Also: Bandi Sanjay: తెలంగాణలో గెలిచేది బీజేపీ పార్టీనే..
ఇండియా కూటమికి వ్యతిరేకంగా 2024 ఎన్నికల్లో గెలిచి నరేంద్రమోడీనే మళ్లీ అధికారంలోకి వస్తారంటూ ప్రచారం చేస్తోంది కాషాయపార్టీ. ‘‘ప్రతిపక్షాలు ప్రధాని మోడీని ఓడించవచ్చని భావిస్తున్నాయి, కలలు కనండి! టెర్మినేటర్ ఎల్లప్పుడూ గెలుస్తాడు’’ అంలటూ బీజేపీ అధికార సోషల్ మీడియా అకౌంట్స్ లో ఈ పోస్టర్ ని షేర్ చేస్తున్నాయి.
మరోవైపు ఇండియా కూటమి రేపు, ఎల్లుండి ముంబైలో సమావేశం కానుంది. కూటమిలోకి మరిన్ని పార్టీలు చేరుతాయని పలువురు నేతలు చెబుతున్నారు. రేపటి సమావేశంలో జెండా, ఎజెండా ఖరారవుతుందని సమాచారం. ఇదిలా ఉంటే బీజేేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కూడా ముంబై వేదికగా బలప్రదర్శనకు సిద్ధమవుతోంది. ఇటీవల ఎన్డీయేలో చేరిన ఎన్సీపీ అజిత్ పవార్ వర్గాన్ని స్వాగతించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.