ఇండిగో విమాన సంస్థ ఇచ్చిన షాక్‌తో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో నరకయాతన పడుతున్నారు. అటు ప్రయాణాలు లేక.. ఇటు ఇంటికి వెళ్లలేక.. తిండి తిప్పలు లేక విమానాశ్రయాల్లోనే పడిగాపులు పడుతున్నారు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రెండు రోజుల నుంచి 200 విమానాలు ఆగిపోయాయి. కొన్ని నడుస్తున్నా.. అవి కూడా సమయ పాలన లేకుండా రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏ ఎయిర్‌పోర్టుల్లో చూసినా వేలాది మంది ప్రయాణికులతో గజిబిజి గందరగోళం నెలకొంది. షెడ్యూల్ ప్రకారం ఎయిర్‌పోర్టులకు చేరుకున్న ప్రయాణికులు అయోమయం గందరగోళానికి గురవుతున్నారు. సమాధానాలు చెప్పేవాళ్లు లేక ఆందోనలు, నిరసనలు చేపడుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా ప్రయాణికులు వేడుకోలు చేస్తున్నారు.
పైకి సిబ్బంది కొరత, సాంకేతిక సమస్య అని చెబుతున్నప్పటికీ ఇంకేదో సమస్య ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇండిగో విమాన సంస్థ నుంచి సరైన వివరణ బయటకు రాలేదు. అయితే ప్రస్తుతం ఎయిర్‌పోర్టులో గందరగోళం నెలకొనడంతో ఇండిగో అధికారులను పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) సమావేశానికి పిలిచింది. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో విమానాల రాకపోకలకు గల అంతరాలను అడిగి తెలుసుకోనున్నారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 200 విమానాలు రద్దయ్యాయి. ఇక గురువారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో 33 విమానాలు రద్దు కాగా.. బెంగళూరులో 73, హైదరాబాద్‌లో 68, అహ్మదాబాద్‌లో ఐదు, కోల్‌కతాలో నాలుగు విమానాలు రద్దు అయ్యాయి. బుధవారం నుంచి సిబ్బంది కొరత కారణంగా ఈ ఇబ్బందులు తలెత్తినట్లుగా విమాన సంస్థ చెబుతోంది.
సహజంగా శీతాకాలంలో ఎక్కువ ప్రయాణాలు ఉంటాయి. విదేశాల్లో క్రిస్మస్ సెలవులు ఉంటాయి. దీంతో ఎక్కువ ప్రయాణాలు జరుగుతుంటాయి. ఇలాంటి ఫీక్ టైమ్‌లో ఇండిగో విమానాలు ఆగిపోవడంతో ఎమర్జెన్సీ జర్నీ చేసేవాళ్లంతా ఆగమాగం అయిపోతున్నారు. సమస్య పరిష్కరించాలంటూ ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
