NTV Telugu Site icon

Modi Surname Case: రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు..

Rahul Gandhi

Rahul Gandhi

Modi Surname Case: కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు చెప్పింది. 2019లో ‘‘మోదీ ఇంటిపేరు’’ వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో శిక్షను ఎదుర్కోనున్నారు. శిక్ష విధించిన తర్వాత సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి 30 రోజుల బెయిల్ మంజూరు చేసింది. తీర్పుపై అప్పీల్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అంతకుముందు రోజు సూరత్ కు వచ్చిన రాహుల్ గాంధీకి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.

‘షేర్-ఎ-హిందుస్తాన్’ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2019లో లోక్ సభ ఎన్నికల ముందు కర్ణాటక కోలార్ లో జరిగిన ర్యాలీలో మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. ‘‘ దొంగలందరికి మోదీ అనే ఇంటి పేరు ఎలా వచ్చింది..?’’ అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ గుజరాత్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ ఫిర్యాదు చేశారు.

Read Also: Pregnancy: ప్రెగ్నెన్సీ రాకుండా కొత్త సాధనం.. తెలుగు రాష్ట్రాల్లో అమలు..?

ఈ కేసుపై చీఫ్ జ్యడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ కోర్టు గత వారం ఇరుపక్షాల తుది వాదనలను విన్నారు. నాలుగేళ్ల నాటి పరువు నష్టం కేసులో తాజాగా ఈ రోజు తీర్పు చెప్పారు. రాహుల్ గాంధీ తరుపున న్యాయవాది కిరీత్ సన్వాలా కోర్టులో తన వాదనలు వినిపించారు. అంతకుముందు మార్చి 23న రాహుల్ గాంధీ కోర్టుకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఐపీసీ సెక్షన్లు 499,500 కింద దాఖలు చేసిన కేసులో రాహుల్ గాంధీ చివరిసారిగా 2021 అక్టోబర్ లో తన వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి సూరత్ కోర్టు హాజరయ్యారు.

గురువారం పార్లమెంట్ వెలుపల కోర్టు ఆదేశాలపై మాట్లాడారు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు. రాహుల్ వైఖరి కారణంగా కాంగ్రెస్ బాధలు పడుతోందని అన్నారు. రాహుల్ చెప్పేది ఎల్లప్పుడూ దేశానికి, కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా ఉంటుందని ఆయన అన్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం రాహుల్ గాంధీని వేధిస్తున్నారని, చివరకు సత్యమే గెలుస్తుందని చెబుతోంది. రాహుల్ గాంధీ తరుపు న్యాయవాది మాట్లాడుతూ కేసు మొదటి నుంచి లోపభూయిష్టంగా ఉందని, ఆయన ప్రధానిని టార్గెట్ చేస్తూ మాట్లాడారని, ఈ కేసులో ఫిర్యాదుదారుగా ప్రధాని ఉండాలని, ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ కాదని అన్నారు.

Show comments