Site icon NTV Telugu

Encounter: మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌.. మైలారపు అడెల్లు భార్య మృతి

Maoist Encounter

Maoist Encounter

2 Naxals killed in encounter with security forces on Maharashtra-Chhattisgarh border: మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పోలీసులు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి, చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాల పోలీసులు సంయుక్తంగా ఈ మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఒక మహిళా మావోయిస్టుతో పాటు ఇద్దరు నక్సల్స్ మరణించారు. ఇరు వర్గాల మధ్య ఎన్ కౌంటర్ జరుగుతున్న సమయంలో మరికొంత మంది నక్సలైట్లు అడవిలోకి పారిపోయినట్లుగా పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ లో కీలక మావోయిస్టు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ భార్య కంతి లింగవ్వ(35) మరణించింది. లింగవ్వ స్వస్థలం నిర్మల్ జిల్లా కడెం.

Read Also: Gurnam Singh: బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా రైతుబంధు..

గడ్చిరోలి పోలీస్ సీ-60 యూనిట్, చత్తీస్ గఢ్ డీఆర్జీ పోలీసులు సరిహద్దులోని దమ్రంచ అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా.. నక్సలైట్లు తారసపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. నక్సలైట్లు ఆరోమేటిక్ రైఫిళ్లను ఉపయోగిస్తూ పోలీసులపైకి కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఎన్‌కౌంటర్ స్థలంలో ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయని, ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని గడ్చిరోలి పోలీసు సూపరింటెండెంట్ నీలోత్‌పాల్ తెలిపారు. గడ్చిరోలి పోలీసులు, బీజాపూర్ పోలీసుల బృందాలు దమ్రంచ అడవుల్లో పెట్రోలింగ్‌ను కొనసాగిస్తున్నారు.

ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం తెలంగాణ సరిహద్దుల్లోనే ఉంది. భూపాలపల్లి జిల్లాను అనుకునే మహారాష్ట్రలోని గడ్చిరోలి, చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలు ఉన్నాయి. భౌగోళికంగా ఈ మూడు రాష్ట్రాలను గోదావరి, ఇంద్రావతి నదులు వేరు చేస్తున్నాయి. ఇరు వైపులా దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఈ ఎన్ కౌంటర్ తో ములుగు, భూపాలపల్లి జిల్లాల పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. అడెల్లు భాస్కర్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. గతంలో కుమ్రం భీం ఆసిఫాబాద్లో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభించాలని అడెల్లు భావిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Exit mobile version