NTV Telugu Site icon

Shah Rukh Khan: షారూఖ్ ఖాన్ బంగ్లాలోకి చొరబడిన ఇద్దరు.. మేకప్ రూంలోనే 8 గంటలు.. చూసి షాకైన స్టార్ హీరో..

Shah Rukh Khan

Shah Rukh Khan

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఇళ్లు ముంబై లోని మన్నత్ బంగ్లాలోకి ఇద్దరు అక్రమంగా చొరబడ్డారు. ఏకంగా 8 గంటల పాటు ఇద్దరు బంగ్లాలోని షారూఖ్ ఖాన్ మేకప్ రూంలో దాక్కుని ఉన్నారు. షారూఖ్ ఫ్యాన్స్ అయిన ఇద్దరు అతడిని కలిసేందుకు ఇదంతా చేశారు. చివరకు వీరిద్దరిని చూసి షాక్ అవ్వడం షారూక్ వంతైంది. ఈ ఘటన గత వారం జరిగింది. నిందితులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ లోని భరూచ్ కు చెందిన పఠాన్ సాహిల్ సలీం ఖాన్, రామ్ సరాఫ్ కుష్వాహా షారూఖ్ ఖాన్ పై అభిమానంతో ఈ పనికి పాల్పడ్డారు.

Read Also: Sushmita Sen : గుండెపోటు తర్వాత ఫోటో పోస్ట్ చేసిన సుస్మితా సేన్.. ఆరోగ్యంపై అప్‌డేట్

వివరాల్లోకి వెళ్తే.. నిందితులిద్దరూ షారూఖ్ ఖాన్ ను కలిసేందుకు బంగ్లాలోకి అక్రమంగా ప్రవేశించారు. మూడో అంతస్తులోని మేకప్ గదిలోకి తెల్లవారుజామున 3 గంటలకు ప్రవేశించిన వీరిద్దరు ఉదయం 10.30 గంటల వరకు అక్కడే 8 గంటల పాటు ఉన్నారు. హౌస్ కీపింగ్ సిబ్బంది సతీష్ వీరిద్దరిని ముందుగా గమనించాడు. మేకప్ గది నుంచి లాబీలోకి తీసుకెళ్లాడు, అక్కడే ఉన్న షారూఖ్ ఖాన్ వీరిద్దరిని చూసి షాక్ అయ్యారు.

మన్నత్ సెక్యూరిటీ గార్డులు వీరిద్దరిని బాంద్రా పోలీసులకు అప్పగించారు. ఇద్దరు వ్యక్తులు బంగ్లాలోకి ప్రవేశించారని, తనకు ఫిబ్రవరి 2 ఉదయం 11 గంటలకు సెక్యూరిటీ గార్డుల నుంచి ఫోన్ వచ్చినట్లు బంగ్లా మేనేజర్ కొలీన్ డిసౌజా పోలీసులకు తెలిపారు. ఇద్దరు నిందితులు మన్నత్ ప్రాంగణంలోని బయటిగోడను ఎక్కి ఇంట్లోకి ప్రవేశించారు. 20, 22 ఏళ్లు ఉన్న ఇద్దరు నిందితులు తాము గుజరాత్ నుంచి వచ్చామని, షారూఖ్ ఖాన్ ను కలిసేందుకు వచ్చామని పోలీసులకు వెల్లడించారు. పోలీసులు తదుపరి విచారణ చేపడుతున్నారు.