NTV Telugu Site icon

Boat Capsizes: బీహార్‌లో ఘోర పడవ ప్రమాదం.. 18 మంది గల్లంతు..

Boat Capsizes

Boat Capsizes

Boat Capsizes: బీహార్ రాష్ట్రంలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. చప్రాలో సరయూ నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు ముగ్గురు మృతదేహాలు వెలికితీశారు. మరో 15 మంది కోసం గాలిస్తున్నారు. ప్రమాద వార్త తెలియగానే అధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లారు. పోలీసులు, రెస్క్యూ టీం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే రాత్రి కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ప్రజలు సాయంత్రం పనులు ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణమైన సమయంలో నదిలో పడవ బోల్తా పడింది.

Read Also: Mahua Moitra: దుబాయ్ నుంచి 47 సార్లు లాగిన్.. మహువా మోయిత్రా కేసులో కీలక విషయాలు..

బీహార్‌లోని సరన్ జిల్లా ఛప్రా ప్రాంతంలోని మాంఝీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మతియార్ గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, డైవర్ల బృందం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తోంది. ప్రమాదానికి గురైన వారంతా రైతులే, డయారాలో వ్యవసాయ పనులు ముగించుకుని పడవలో ఇళ్లకు తిరిగి వస్తుండగా ఒకసారిగా సరయూ నదిలో పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఒడ్డున ఉన్న గ్రామస్తులు పడవ మునిగిపోవడాన్ని గమనించి కేకలు వేశారు. దీంతో పడవలో ఉన్న వారిని రక్షించేందుకు ఘటన స్థలానికి వెళ్లే సరికే అప్పటికే పడవ మునిగిపోయింది. సంఘటన స్థలంలో ఎక్మా ఎమ్మెల్యే శ్రీకాంత్ యాదవ్ ఉన్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ని పర్యవేక్షిస్తున్నారు. ఘటన స్థలంలో తీవ్ర అంధకారం నెలకొని ఉండటంతో రక్షణ చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.