బిహార్ రాష్ట్రంలో పిడుగుపాటుకు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. భాగల్పూర్ జిల్లాలో గరిష్టంగా పిడుగుపాటుకు ఆరుగురు మరణించారు. వైశాలి జిల్లాలో ముగ్గురు, బంకా జిల్లాలో ఇద్దరు, ఖగారియా జిల్లాలో ఇద్దరు, ముంగేర్, కతిహార్, మాధేపురా, సహర్సా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున పిడుగుపాటుకు ప్రాణాలు వదిలారు. శనివారం రాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో భారీవర్షాలు కురవడంతో 17 మంది మరణాలు సంభవించాయి. బిహార్ రాష్ట్రంలో గత ఏడాది కూడా పిడుగు పాటుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
బిహార్‌లో పిడుగులు పడి 17 మంది మృతి చెందడం పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పిడుగుపాటుకు మరణించిన ప్రతి కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రతికూల వాతావరణంలో ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడకుండా విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసిన సూచనలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాంటి సమయంలో ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ఆయన సూచించారు.
ఇదిలా ఉండగా.. గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు, మధ్యప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్, గంగానది పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్‌లో నైరుతి రుతుపవనాలు వ్యాపించాయని భారత వాతావరణ విభాగం ఆదివారం తెలిపింది. ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశం అంతటా వచ్చే 2-3 రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. రాబోయే కొద్ది రోజుల్లో బిహార్, జార్ఖండ్, ఒడిశా,పశ్చిమ బెంగాల్‌లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.