Brain eating amoeba: అత్యంత ప్రాణాంతకమైన ‘‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’’ నుంచి కేరళకు చెందిన 14 ఏళ్ల బాలుడు బయటపడ్డాడు. అమీబా వల్ల కలిగి ‘‘మెనింగోఎన్సెఫాలిటిస్’’ నుంచి కోలుకున్నట్లు ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. ఈ ఇన్ఫెక్షన్‌లో అత్యధిక మరణాలు రేటు ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వారిలో 97 శాతం మంది మరణిస్తుంటారు. అయితే, కేరళకు చెందిన బాలుడు మాత్రం అనూహ్యంగా ఈ వ్యాధి నుంచి కోలుకున్నాడు. ఈ వ్యాధిలో మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని, దేశంలో ఇది అరుదైన సంఘటన అని మంత్రి అభివర్ణించారు.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే ‘‘మెదడుని తినే అమీబా’’ వ్యాధి నుంచి కేవలం 11 మంది మాత్రమే కోలుకున్నారు. అబ్బాయి ప్రాణాలు కాపాడిన డాక్టర్లను మంత్రి వీణా జార్జ్ కొనియాడు. కోజికోడ్ జిల్లాలోని తిక్కోడికి చెందిన బాలుడికి అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ సోకింది. బాలుడికి మూర్చ వ్యాధి లక్షణాలు ఉండటంతో అతడి తండ్రి పయ్యోలిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అమీబిక్ వ్యాధి లక్షణాలు ఉండటంతో అతడిని జూలై 1న కోజికోడ్‌లోని బేబీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు.
Read Also: Hyderabad: సూసైడ్ నోట్ రాసి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. కారణమిదే..?
వైద్యులు ఆలస్యం చేయకుండా అతనికి అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్‌కు చికిత్స చేయడం ప్రారంభించారు. బాలుడు తొమ్మిది రోజుల పాటు ఐసీయూలో చికిత్స పొందాడు. మొత్తం 22 రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగిటివ్ రావడంతో అతడిని డిశ్చార్జ్ చేశారు. గత రెండు నెలలుగా కేరళలో ముగ్గురు పిల్లల ప్రాణాలను ఈ వ్యాధి బలిగొంది. మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.
అమీబిక్ మెనింగోఎన్సాఫాలిటిస్ అనేది నీటి ద్వారా వ్యాపించే అత్యంత అరుదైన వ్యాధి. నెగ్లియో ఫౌలేరి అనే అమీబా ఉన్న నీటిలో స్నానం చేయడం, ఈతకు వెళ్లడం ద్వారా ముక్కులోకి నీరు చేరిన సందర్భంలో ఇది శరీరంలోకి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. 26 లక్షల్లో కేవలం ఒకరికి మాత్రమే ఈ వ్యాధి సోకుుతుంది. తలనొప్పి, జ్వరం, వికారం మరియు వాంతులు వంటి బాక్టీరియల్ మెనింజైటిస్‌ను పోలి ఉండే ప్రారంభ లక్షణాలతో సంక్రమణ వేగంగా అభివృద్ధి చెందుతుంది. అమీబా మెదడు కణాలను నాశనం చేస్తుంది. దీంతో మూర్ఛ, గందరగోళం, కోమా వంటి లక్షణాలు త్వరగా ఏర్పడుతాయి. చివరకు మరణం సంభవిస్తుంది.