Mumbai: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున ర్యాలీలు జరిగాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ముంబై శివార్లలోన మీరా రోడ్‌లో ఆదివారం రాత్రి ఘర్షణ ఏర్పడింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేశారు.
Read Also: Ayodhya Ram Mandir: అయోధ్యకు 1000 కిలోమీటర్ల దూరంలో.. మరో రామ మందిరం ప్రారంభం..
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఎవరైనా ప్రయత్నించినా సహించేది లేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ర్యాలీలో ఘర్షణపై ఆయన పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఇలాంటి ఘర్షణలపై ‘జీరో టాలరెన్స్’ వ్యవహరిస్తుందని చెప్పారు. అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టనను పురస్కరించుకుని ఆదివారం రాత్రి కార్లు, మోటార్ సైకిళ్లతో 10-12 మంది వ్యక్తులు ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో క్రాకర్స్‌ని కాల్చడంతో మరో వర్గం వారు అభ్యంతరం చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
మీరా భయేందర్‌లోని నయా నగర్‌లో జరిగిన ఘటనపై సమచారం తీసుకుంటున్నట్లు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పోలీసులను ఆదేశించారు. ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేశారు మరియు ప్రమేయం ఉన్న ఇతరులను గుర్తించడానికి మరియు అరెస్టు చేయడానికి సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.