NTV Telugu Site icon

Anantnag Encounter: 5 రోజులుగా ఎన్‌కౌంటర్.. ఇంకా చిక్కని ఉగ్రవాదులు.. ఆర్మీకి సవాళ్లు..

Jammu Kashmir

Jammu Kashmir

Anantnag Encounter: జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్ 5వ రోజుకు చేరుకుంది. బుధవారం ప్రారంభమైన ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటికే నలుగురు ఆర్మీ అధికారులు వీరమరణం పొందారు. ఎలాగైన ఉగ్రవాదులను మట్టుపెట్టాలనే వ్యూహాలతో భద్రతాసిబ్బంది ఉంది. అయితే దట్టమైన అడువులు, కొండలు, లోయలు ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్నాయి. జింగిల్ వార్‌ఫేర్ లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు సైన్యానికి సవాల్ విసురుతున్నారు.

100 గంటలకు పైగా భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. డ్రోన్లు, హెలికాప్టర్లు, ఐఈడీ బాంబులు ఇలా అత్యాధునిక ఆయుధాలను సైన్యం ఉపయోగిస్తోంది. అయితే పీఓకే సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతం గురించి ఉగ్రవాదులకు మంచి పట్టు ఉండటం, దాడి చేసి సులువుగా పాకిస్తాన్ లోకి వెళ్లడం చేస్తున్నారు. భారీగా ఆయుధాలు కలిగిన ఉగ్రవాదులు అడవిలో వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉన్నట్టు సైన్యం అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే శనివారం ఆర్మీ నార్తర్న్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఎన్కౌంటర్ ప్రదేశాన్ని సందర్శించారు.

బుధవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ ఎన్కౌంటర్ లో టెర్రిస్టుల స్థావరానికి చేరుకోవాలని భద్రతా బలగాలు అడవిలోకి ప్రవేశించాయి. అయితే ప్లాన్ ప్రకారం ఒక లోయప్రాంతానికి చేరుకుంటారని అంచనా వేసిన టెర్రరిస్టులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. ఈ ఆపరేషన్ కి ముందుండి నాయకత్వం వహించిన కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ , మేజర్ ఆశిష్ ధోంచక్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హిమయూన్ భట్, మరో సైనికుడు మరణించాడు.

Read Also: Libya: మృతుల దిబ్బగా లిబియా.. 11 వేల మంది మృతి, 10 వేల మంది మిస్సింగ్..

భద్రతా బలగాలకు సవాళ్లు..

తీవ్రవాదులు అటవీ, ఎతైన ప్రదేశాల్లో దాడుల్లో ఆరితేరి ఉన్నారు. ఎక్కువ కాలం యుద్ధం చేసేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేసుకున్నారు. ఇలాంటి దాడులను ఎదుర్కోవడం చాలా కష్టంతో కూడుకున్నదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలోని రాజౌరి, పూంచ్ ఏరియాల్లో ఇలాంటి యుద్ధవ్యూహాలనే తీవ్రవాదులు అనుసరిస్తున్నారు. మే నెలలో ఇలాగే జరిగిన దాడిలో మొత్తం 10 మంది సైనికులు మరణించారు.

ఈ ప్రాంతంలోని పీర్‌పంజల్ పర్వతాలు, దట్టమైన పైన్ అడవులు ఉగ్రవాదులకు ఆసరాగా ఉన్నాయి. దీనికి తోడు దాడులు చేసి వెంటనే పీఓకే వెళ్లేందుకు ఈ పర్వతాలు, అడవులు సహకరిస్తున్నాయి. ఈ దట్టమైన అడవులు పీఓకే, జమ్మూ కాశ్మీర్ మధ్య ఉండటంతో తరుచూ పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు దేశంలోకి చొరబడుతుున్నారు. ఈ అడవుల్లో ముందున్న మనిషిని కూడా గుర్తించలేని పరిస్తితి ఉంటుంది. అయితే ఇలాంటి సౌకర్యాల కారణంగానే భద్రతా బలగాలు అడవుల్లోకి ప్రవేశించిన వెంటనే అప్పటికే పొజిషన్ తీసుకున్న ఉగ్రవాదులు, కాల్పులు జరిపి ఎక్కువ మంది సైనికులను బలితీసుకుంటున్నారు.