NTV Telugu Site icon

Bihar: పేపర్ లీకేజీకి పాల్పడితే పదేళ్లు జైలు.. రూ.కోటి ఫైన్.. అసెంబ్లీలో బిల్లు ఆమోదం

Nitishkumar

Nitishkumar

పేపర్ లీకేజీ వ్యవహారాలు దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. ఏదొక రాష్ట్రంలో అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కేంద్రం నిర్వహించిన నీట్ ఎగ్జామ్ పేపర్  లీకేజీ కావడం పెను సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో బీహార్‌లోని నితీష్ కుమార్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రం లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు, ప్రభుత్వ నియామక పోటీ పరీక్షల్లో అవకతవకల్ని నియంత్రించేందుకు బీహార్‌ అసెంబ్లీలో కీలక బిల్లును బుధవారం ఆమోదించింది. బీహార్ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ బిల్లు-2024ను రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరి సభలో ప్రవేశపెట్టగా.. ప్రతిపక్షాల వాకౌట్‌ మధ్య మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది.

నీట్‌-యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌, అక్రమాల ఆరోపణలపై చెలరేగిన వివాదానికి బీహార్‌ కేంద్ర బిందువుగా మారింది. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల్లో అక్రమాలను కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం.. ఆయా పరీక్షల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.కోటి జరిమానాతో పాటు కఠినంగా శిక్షించనున్నారు.

పేపర్ లీకేజీపై ప్రభుత్వం కఠిన చట్టం తీసుకువచ్చిందని మంత్రి విజయ్ కుమార్ చౌదరి తెలిపారు. ఈ చట్టంతో విద్యార్థుల భవిష్యత్ సురక్షితంగా ఉంటుందని చెప్పారు. అక్రమాలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.