NTV Telugu Site icon

US-Canada: కెనడా నుంచి అమెరికాకు భారతీయుల అక్రమ వలస.. 10 రెట్లు పెరిగినట్లు నివేదిక..

Us Canada

Us Canada

US-Canada: కెనడా నుంచి అమెరికాకు భారతీయుల అక్రమ వలసలు పెరిగినట్లు ఓ నివేదిక వెల్లడించింది. అక్రమంగా సరిహద్దు దాటడం 10 రెట్లు పెరిగినట్లు చెబుతోంది. యూఎస్ సరిహద్దు గస్తీ డేటా ఈ వివరాలను చెబుతోంది. భారతదేశం నుంచి అక్రమ వలసలు ఉన్నప్పటికీ, ఇటీవల కాలంలో ఇది ఎక్కువగా పెరిగినట్లు అమెరికన్ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. యూఎస్ సరిహద్దు డేటా ప్రకారం.. సెప్టెంబర్ 30 వరకు ఈ ఏడాదిలో యూఎస్-కెనడా సరిహద్దుల్లో 14,000 మందికి పైగా భారతీయులు అరెస్టయ్యారు. ఇది కేవలం రెండేళ్లలో 10 శాతం పెరిగింది. అమెరికా-కెనడా సరిహద్దుల్లో జరిగిన మొత్తం అరెస్టుల్లో 60 శాతం భారత సంతతి వ్యక్తులే ఉన్నారు.

Read Also: PM Modi: ప్రధాని మోడీ ఖాతాలో మరో అత్యున్నత అవార్డ్.. క్వీన్ ఎలిజబెత్ తర్వాత రెండో వ్యక్తిగా హిస్టరీ..

ప్యూ రీసెర్చ్ సెంటర్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2022 నాటికి అమెరికాలో అక్రమంగా దాదాపుగా 7,25,000 మంది భారతీయులు నివిస్తున్నట్లు అంచనా. అయితే, కెనడా నుంచి అమెరికాకు పెరిగిన వలసలకు కారణాలను కూడా రిపోర్ట్ చర్చింది. రాజకీయ అణిచివేత, ఖలిస్తానీ తీవ్రవాదం పెరగడం వంటి అంశాలు దోహదం చేస్తున్నట్లు తెలుస్తోంది. యూఎస్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ, వీసాలు, పర్మిట్ల కోసం ఎక్కువ కాలం వేచి ఉండటం కూడా అక్రమ వలసల్ని పెంచినట్లు తెలుస్తోంది.

కొన్ని సందర్భాల్లో ఈ వలసలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. 2022లో జనవరిలో తీవ్రమైన చలిలో జగదీష్ పటేల్, అతడి భార్య వైశాలిబెన్, ఇద్దరు చిన్న పిల్లలు ఇలాగే యూఎస్ కెనడా సరిహద్దు దాటాలని ప్రయత్నించారు. అయితే, గడ్డకట్టే చలిలో చిక్కుకుని నలుగురు మరణించడం ప్రపంచ స్థాయి వార్తగా నిలిచింది. మెరుగైన జీవితం కోసం పాఠశాల ఉపాధ్యాయుడు జగదీష్ అతడి కుటుంబం అమెరికా పయణమైంది. -36 డిగ్రీ సెల్సియస్ చలిలో బార్డర్ దాటేందుకు యత్నించి మరణించారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా గెలవడంతో సరిహద్దుల్లో వలసల్ని అడ్డుకునేందుకు ‘‘బోర్డర్ సీజర్’’గా వలసల్ని వ్యతిరేకించే టామ్ హోమన్‌ని నియమించారు.