NTV Telugu Site icon

US Visa: రికార్డ్ బద్ధలు..ఈ ఏడాది 10 లక్షల భారతీయులకు అమెరికా వీసాలు..

Usvisas

Usvisas

US Visa: భారత్, అమెరికాల మధ్య ఇటీవల కాలంలో బంధం బలపడుతోంది. ఇటీవల కాలంలో భారతదేశానికి అగ్రరాజ్యం పెద్దపీట వేస్తోంది. భారతీయులకు వీసాలను జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది 10 లక్షల మంది భారతీయులకు అమెరికా వీసాలను మంజూరు అయ్యాయి. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమెరికా రాయబార కార్యాలయం తన అధికార సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అన్ని రకాల వీసాలు కలిసి ఈ రికార్డు నమోదైంది.

మిషన్ 1M పూర్తైంది. భారత్ లో ఈ ఏడాది వీసాల ప్రక్రియలో మేం పెట్టుకున్న మిలియన్ వీసాల జారీ లక్ష్యాన్ని దాటేశాం. అయితే మేం ఇక్కడితో ఆగిపోం. రాబోయే నెలల్లో మరింత వృద్ధి సాధిస్తాం. అమెరికాలో పర్యటించేందుకు మరింత మంది భారతీయులకు అవకాశం కల్పిస్తామని అమెరికా ఎంబసీ తన పోస్టులో రాసుకొచ్చింది.

Read Also: Stroke: వాయుకాలుష్యం, పక్షవాతం మధ్య సంబంధం.. పరిశోధకులు ఏం చెప్పారంటే.?

అమెరికా రాయబార కార్యాలయం ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఈ వీడియోలో భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి మాట్లాడుతూ.. ఈ రికార్డుపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన బంధ మాదని, మా ద్వైపాక్షిక సంబంధాల్లో భారత్ ముఖ్యమైందని, ఈ బంధాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు రాబోయే రోజుల్లో మరింత మంది భారతీయులకు వీసాలు అందచేస్తామని ఆయన తెలిపారు. 2022 ఏడాది మొత్తం వీసాలకు మించి ఈ ఏడాది రికార్డు స్థాయిలో వీసాలు జారీ అయ్యాయి. 2019తో పోలిస్తే ఇది 20 శాతం ఎక్కువ. ప్రస్తుతం అమెరికా ప్రపంచవ్యాప్తంగా వీసాలు జారీ చేసే మొత్తంలో 10 శాతం భారతీయులకే వచ్చాయి. విద్యార్థి వీసాల్లో 20 శాతం, హెచ్, ఎల్ కేటగిరి ఉద్యోగ వీసాల్లో 65 శాతం భారతీయులకే వచ్చాయి.