Yash Toxic: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా.. ఇప్పుడు ఇంగ్లీష్ వెర్షన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 4 నుంచి ఎంపిక చేసిన ఇండియన్ థియేటర్లలో ఈ ఇంగ్లీష్ వెర్షన్‌ను ప్రదర్శించనున్నారని మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. యశ్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. సినిమా షూటింగ్‌ను కన్నడతో పాటు ఇంగ్లీష్‌లోనూ చిత్రీకరించారు. ఇప్పటికే విడుదలైన ఇండియన్ లాంగ్వేజ్ వెర్షన్లతో పోలిస్తే ఇంగ్లీష్ వెర్షన్‌ను కాస్త ట్రిమ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారని సమాచారం.
తాజా సమాచారం ప్రకారం.. ఇంగ్లీష్ వెర్షన్ రన్‌టైమ్ సుమారు 2 గంటల 57 నిమిషాలుగా ఉండనుంది. అంటే ఇప్పటికే విడుదలైన వెర్షన్ల కంటే దాదాపు 18 నిమిషాలు తక్కువగా ఉండనుంది. ఇక ‘టాక్సిక్’ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్‌ను నమోదు చేసింది. విడుదలకు ముందే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌లో మంచి రెస్పాన్స్ కనిపించింది. ఆగస్టు 25 నాటికి దేశవ్యాప్తంగా 9 లక్షలకు పైగా టికెట్లు అడ్వాన్స్‌గా అమ్ముడైనట్లు అప్పటి నివేదికలు వెల్లడించాయి. ఆగస్టు 26న ఇండియన్ లాంగ్వేజ్ వెర్షన్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘టాక్సిక్’.. ఇక ఇంగ్లీష్ వెర్షన్‌తో మరింత మంది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమాకు ఇంగ్లీష్ వెర్షన్ కూడా అందుబాటులోకి రావడంతో యశ్ అభిమానుల్లో మరోసారి ఆసక్తి పెరిగింది. సెప్టెంబర్ 4 నుంచి ఇంగ్లీష్ వెర్షన్‌కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

