నోరు మంచిదయితే ఊరు మంచిగా ఉంటుంది అంటారు పెద్దలు.. ఇక ఈ కాలంలో నోరును ఎంత అదుపులో పెట్టుకొంటే అంత పైకి ఎదుగుతారు అని అనుభవజ్ఞులు సలహాలు ఇస్తూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం వీటన్నింటిని పెడచెవిన పెట్టి నోటికి ఏ మాట వస్తే ఆ మాట సోషల్ మీడియా ద్వారా అనేసి ఇదుగో ఇలా చిక్కులో పడుతుంటారు. అంతగా చిక్కులో పడిన ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా.. ఇంకెవరు ది ఫేమస్ సౌండ్ ఇంజీనీర్ రసూల్ పోకుట్టి. ఈ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాను గే లవ్ స్టోరీ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసి అందరికి టార్గెట్ గా మారాడు. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గానూ ఆస్కార్ అవార్డు అందుకున్న రసూల్.. ఒక తెలుగు సినిమా గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. వెంటనే ఇతడిని చిత్ర పరిశ్రమ నుంచి బ్యాన్ చేయాలంటూ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు ఇండస్ట్రీ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన సినిమాను, వారి పనితనాన్ని కించపరిచినట్లు మాట్లాడడం ఎంతవరకు సబబు అంటూ ఏకిపారేస్తున్నారు. ఇక ఈ ట్వీట్ ఎఫెక్ట్ రసూల్ కు బాగా గట్టిగానే తగులుతున్నట్లు కనిపిస్తోంది. తెలుగులో పుష్ప, రాధే శ్యామ్, అరణ్య చిత్రాలకు రసూల్ సౌండ్ ఇంజినీర్ గా పనిచేశాడు. ప్రస్తుతం పుష్ప 2 కోసం వర్క్ చేస్తున్నాడు. ఇక ఈయనగారి నోటిదురుసు వలన పుష్ప 2 నుంచి రసూల్ ను తొలగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రసూల్ ను పుష్ప 2 నుంచి తొలగించాలని అభిమానులు డిమాండ్ చేయడం వలన మేకర్స్ ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా క్లారిటీ ఇచ్చేవరకు ఆగాల్సిందే.