ఉద్యమాల పురిటి గడ్డ వరంగల్ నుండి చిత్రసీమకు వచ్చిన వేణు ఊడుగుల తొలి యత్నంగా నాలుగేళ్ళ క్రితం ‘నీదీ నాదీ ఒకే కథ’ మూవీని తెరకెక్కించాడు. మళ్ళీ ఇప్పుడు ‘విరాట పర్వం’ సినిమాతో జనం ముందుకు రాబోతున్నాడు. శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఖమ్మంకు చెందిన తూము సరళ జీవితం ఆధారంగా తెరకెక్కించినట్టు దర్శకుడు వేణు తెలిపాడు. అంతేకాదు… సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరంగల్ కు వెళ్ళినప్పుడు సరళ కుటుంబ సభ్యులనూ ఈ చిత్ర బృందం పరామర్శించింది. అయితే సరళ కథను యథాతథంగా వేణు తెర మీద చూపించి ఉంటారా? అదే? అనే సందేహాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు.
కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం ఉన్న సరళ యుక్తవయసులోనే తన తండ్రి ప్రభావంతో నక్సలిజం మీద ఆసక్తిని పెంచుకుంది. తానూ తుపాకి చేత పట్టి అడవులకు వెళ్లి సమ సమాజ నిర్మాణం కోసం సాయుధ పోరాటం చేయాలని కలలుకంది. మెడిసన్ చదవాలనే కోరికతో ఇంటర్మీడియెట్ లో బైపీసీ తీసుకుని మొదటి సంవత్సరం పూర్తి చేయకుండానే అడవి బాట పట్టింది. అయితే నక్సలిజం మీద మోజుతో అడవికి చేరిన సరళకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. కొన్ని నెలల పాటు వేచి ఉండి, అడవిలోని అన్నలను కలిసి తన మనోగతాన్ని సరళ చెప్పినప్పుడు ఆమెలో వారికి ఓ పోలీస్ ఇన్ఫార్మర్ కనిపించాడు. దాంతో నిర్దయగా సరళను హింసించి, చంపేసి, తగలపెట్టేశారు. ఆ తర్వాత తమ తప్పు తెలుసుకున్న పీపుల్స్ వార్ నాయకులు దానిని అంగీకరిస్తూ బహిరంగ క్షమాపణ చెప్పారు. మరి విప్లవోద్యమం పట్ల ప్రేమతో అడవి బాటపట్టిన సరళ జీవితంలోని దారుణ ఘటనలను దర్శకుడు వేణు హృదయానికి హత్తుకునేలా అలానే తీసి ఉంటాడా? అనేది చాలా మంది మదిని తొలుస్తున్న ప్రశ్న. ఎందుకంటే… కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా… ఇప్పుడు సరళ జీవిత చరమాంక ఘట్టలను యథాతథంగా తీస్తే తీవ్రవాదులు, లెఫ్టిస్టుల నుండి విమర్శలు ఎదురవుతాయి. పోనీ ఆమె జీవితాన్ని సినిమాటిక్ చేసి చూపిస్తే… కమర్షియల్ సక్సెస్ కోసం తమ అమ్మాయి జీవితాన్ని వాడుకున్నారనే విమర్శ కుటుంబ సభ్యుల నుండి వస్తుంది.
మొన్న బెల్లి లలిత…. ఇవాళ తూము సరళ!
సరళ జీవితాన్ని వేణు ఊడుగుల ఎలా తీశాడోననే అనుమానం కొందరికి రావడంలో అర్థం ఉంది. ఎందుకంటే ఆ మధ్య వచ్చిన ‘నయీమ్ డైరీస్’ మూవీని నక్సలిజం నేపధ్యం ఉన్న దాము బాలాజీ తెరకెక్కించారు. కొంతకాలం నక్సలైట్ గా ఉన్న నయీమ్ ఆ తర్వాత వారితో విభేదించి, అడవి నుండి బయటకు వచ్చేశాడు. ఆపైన పోలీసులకు లొంగిపోయి, నక్సలైట్లకే కంటిలో నలుసుగా మారాడు. ఆ అంశాలన్నటినీ ‘నయీమ్ డైరీస్’లో చూపించారు. ఆ క్రమంలో వామపక్ష భావాలు కలిగిన బెల్లి లలిత నయీమ్ పట్ల ఆకర్షితురాలైందని, ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో నయీమ్ కారణంగానే ఆమె దారుణంగా హత్య చేయబడిందని ఈ సినిమా ద్వారా దర్శకుడు తెలిపారు. ఈ సినిమా విడుదల కాగానే బెల్లి లలిత కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. లలిత జీవితాన్ని వెండితెరపై తప్పుగా చూపించారంటూ ఆవేదన చెందారు. సినిమా ప్రదర్శన నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. దర్శకుడు దాము సైతం వారి మనోభావాలను గౌరవించి, క్షమాపణ చెప్పారు. అందువల్ల ఇప్పుడు సరళకు ‘విరాట పర్వం’లో న్యాయం జరుగుతుందా? లేదా? అని ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.