Tarakaratna:తెలుగు చిత్రసీమలో నందమూరి తారక రామారావు బాణీయే ప్రత్యేకమైనది. యన్టీఆర్ నటవారసుల్లోనూ పలువురు తమ ప్రత్యేకతలు చాటుకుంటున్నారు. వారిలో నందమూరి తారకరత్న తీరే వేరని చెప్పవచ్చు. తారకరత్న నటజీవితం, వ్యక్తిగత జీవితం అన్నీ కూడా ఆసక్తి కలిగించే అంశాలే! ఆయన ఏ నాడూ టాప్ స్టార్ గా రాజ్యమేలకున్నా, చిత్రసీమలో మంచి పేరుంది. అలాగే రాజకీయ రంగంలో ప్రత్యక్షంగా పోటీచేయక పోయినా, రాజకీయ వర్గాల్లో పార్టీ భేదాలు లేకుండా ఆదరణ లభిస్తోంది. ఇవన్నీ చూస్తోంటేనే తారకరత్న తీరు వేరని చెప్పక తప్పదు. ఆయన ప్రేమకథ కూడా ప్రత్యేకతను చాటుకుందనే చెప్పాలి!
రావడం రావడమే తొమ్మిది సినిమాల ఓపెనింగ్స్ తో రికార్డ్ సృష్టించారు తారకరత్న. నిజం చెప్పాలంటే తారకరత్న హీరో కావడమే బలవంతంగా జరిగింది. ఎందుకంటే 1995లో యన్టీఆర్ వారసులందరూ చంద్రబాబు నాయుడుకు బాసటగా నిలచి, ఆయన ముఖ్యమంత్రి కావడానికి కృషి చేశారు. ఆ తరువాత నుంచీ యన్టీఆర్ వారసుల్లో భేదాలు పొడసూపాయి. మొదట్లో చంద్రబాబు మంత్రివర్గంలో రాష్ట్ర రోడ్డు రవాణా శాఖమంత్రిగా పనిచేసిన నందమూరి హరికృష్ణను ఆ పదవి నుంచి కొన్ని సాంకేతిక కారణాలు చూపించి, అర్ధాంతరంగా తొలగించింది చంద్రబాబు ప్రభుత్వం. దాంతో కినుక వహించిన హరికృష్ణ, తరువాత ‘అన్న’ తెలుగు దేశం పార్టీ నెలకొల్పి చంద్రబాబుపైనే వ్యతిరేకత చాటారు. ఆ తరువాత యన్టీఆర్ తనయుల్లో హరికృష్ణకు కొందరు వ్యతిరేకంగా ఉన్నారు. అలాంటి వారిలో బాలకృష్ణకు ముందున్న మోహనకృష్ణ, తరువాతి రామకృష్ణ ముఖ్యులని చెప్పవచ్చు. అప్పటికే హరికృష్ణ రెండో భార్య శాలిని కొడుకు జూనియర్ యన్టీఆర్ గా చిత్రసీమలో పేరు సంపాదిస్తున్నారు. దీంతో అతనికి పోటీగా మోహనకృష్ణ, రామకృష్ణ ‘తారకరత్న’ను రంగంలోకి దించారు. నిజానికి తారకరత్న అసలు పేరు ‘ఓబులేసు చౌదరి’. ఆ పేరును నందమూరి తారకరత్నగా మార్చి, అతని పేరు కూడా షార్ట్ ఫామ్ లో యన్.టి.ఆర్. అని వచ్చేలా చూశారు. ఒకే రోజు తొమ్మిది చిత్రాలలో హీరోగా నటిస్తూ ముహూర్తాలు జరుపుకున్నా, అవేవీ తారకరత్నకు కలసి రాలేదు. దాంతో కొన్ని చిత్రాలలో విలన్ వేషాలూ వేయవలసి వచ్చింది.
ఎంతో ఘనచరిత ఉన్న నందమూరి నటవంశం నుండి వచ్చిన తారకరత్న హీరోగా రాణించలేక పోయారు. అయితే నటునిగా తనను ప్రూవ్ చేసుకోవడానికి 2009లో ‘అమరావతి’ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనూ నటించారు. ఆ సినిమాతో బెస్ట్ విలన్ గా నంది అవార్డు కూడా అందుకున్నారు తారకరత్న. ఆ తరువాత నారా రోహిత్ హీరోగా నటించిన ‘రాజా చేయి వేస్తే’లోనూ ప్రతినాయకునిగా మెప్పించారు తారక్. ఏదో నటునిగా తనదైన పంథాలో బండి లాగిస్తూ వచ్చారు. తారకరత్నకు చిన్పప్పటి నుంచీ అందరితో కలివిడిగా ఉండడం ఇష్టం. దాంతో ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. అలా పబ్ కల్చర్ కు బాగా అలవాటు పడ్డారు. ఆ సమయంలోనే ఫ్యాషన్ డిజైనర్ అలేఖ్య రెడ్డితో పరిచయం ఏర్పడింది. అప్పటికే అలేఖ్యకు పెళ్ళయి, భర్తతో పడక ఒంటరిగా ఉంటోంది. ఒక నాటి ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఎలిమినేటి మాధవరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డితో అలేఖ్య మొదటి వివాహం జరిగింది. వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఆమె తరువాత విడాకులు తీసుకుంది. అలేఖ్య, తారకరత్న తొలుత మంచి స్నేహితులుగా ఉన్నారు. తరువాత వారి పరిచయం ప్రణయంగా మారింది. ఆపై 2012 ఆగస్టు 2న సంఘీ టెంపుల్ లో వారి పరిణయమూ జరిగింది. తెలుగుదేశం పార్టీతోనే మాధవరెడ్డి ఓ వెలుగు వెలిగారు. పైగా మాధవరెడ్డి కుటుంబంతో చంద్రబాబు నాయుడుకు, నందమూరి ఫ్యామిలీకి కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాధవరెడ్డి తనయుని మాజీ భార్యను తమ కుమారుడు వివాహం చేసుకోవడాన్ని తారకరత్న తండ్రి మోహనకృష్ణ అంగీకరించలేదు. అలాగే అలేఖ్య కుటుంబసభ్యులు సైతం వారి పెళ్ళిని ఆమోదించలేక పోయారు. ఈ నేపథ్యంలో అలేఖ్య తల్లికి సోదరి భర్త అయిన విజయసాయిరెడ్డి ఈ జంటను ఆదరించారు. అప్పటికే విజయసాయి రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర రెడ్డికి ఎంతో సన్నిహితులు, ఆ తరువాత జగన్మోహన్ రెడ్డికి మరింత చేరువయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కుటుంబానికి చెందిన తారకరత్న, వైసీపీకి చెందిన విజయసాయి రెడ్డి సన్నిహిత బంధువు అలేఖ్యను పెళ్ళాడడమూ చర్చనీయాంశమయింది. తారకరత్న, అలేఖ్య దంపతులకు ఓ పాప. ఆమె పేరు నిషిక.
తారకరత్న, అలేఖ్యను విజయసాయి రెడ్డి ఆదరించడాన్నీ కొందరు తప్పు పట్టారు. అయితే ఆయన అవేవీ పట్టించుకోలేదు. నటునిగా అవకాశాలు అంతగా లేని తారకరత్న సంపాదన సైతం తక్కువగానే ఉండేది. ఆయన మిత్రులు కొందరు ఆర్థికంగా ఆదుకున్నారు. ఒకానొక సమయంలో జూనియర్ యన్టీఆర్ కూడా తారకరత్నకు సాయం అందించినట్టు తెలుస్తోంది. నిజం చెప్పాలంటే, నటరత్న యన్టీఆర్ తనయుల్లో బాలకృష్ణ తరువాత అంతటి ఆర్థిక బలం ఉన్నది తారకరత్న తండ్రి మోహనకృష్ణకే. అలాంటి ఫ్యామిలీకి ఏకైక వారసుడైన తారకరత్న ప్రేమ వివాహం కారణంగా, కన్నవారికి దూరంగా ఉండవలసి వచ్చింది. మిత్రులు, సన్నిహితులు, అభిమానులు జాలి చూపించారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో మాత్రం తారకరత్న తప్పకుండా తనవంతుగా పాల్గొని ప్రచారం చేసేవారు. ఆ ప్రచారాల కారణంగానే తెలుగునేలపై తారకరత్నకు అభిమానగణాలు ఏర్పడ్డాయి. వారందరితోనూ ఎంతో సఖ్యంగా ఉండేవారు తారకరత్న. ఈ సారి 2024 ఎన్నికల్లో గన్నవరం నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారాయన. ఆ విషయాన్ని తన మేనమామ, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికీ తీసుకువెళ్ళారు. ఇంకా సమయం ఉంది కదా అని దాటవేశారు చంద్రబాబు. ఈ లోగానే నారా లోకేశ్ పాదయాత్ర చేయాలని భావించడం, ఆ యాత్రలో తానూ పాలుపంచుకోవడానికి తారకరత్న వెళ్లడం జరిగాయి. అక్కడే ఆయన స్పృహ తప్పి తీవ్ర అనారోగ్యానికి గురికావడం జరిగాయి. అప్పటి దాకా తారకరత్న గురించి కొందరికే తెలిసిన విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ఏది ఏమైనా ‘ప్రేమకోసం’ తారకరత్న తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సన్నిహితులు, అభిమానులు అభినందిస్తూనే ఉన్నారు.