Site icon NTV Telugu

The Power Of The Dog: ద ప‌వ‌ర్ ఆఫ్ ద డాగ్లోని ప‌వ‌ర్ ఏంటి?

the power of dog

the power of dog

సినీల‌వ‌ర్స్ అంద‌రి నోటా ఇప్పుడు ద ప‌వ‌ర్ ఆఫ్ ద డాగ్ మాటే వినిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా ఏకంగా ఆస్కార్ బ‌రిలో 12 నామినేష‌న్స్ సంపాదించింది. అందునా ప్ర‌ధాన విభాగాల‌యిన ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ ద‌ర్శ‌క‌త్వం, ఉత్త‌మ‌ న‌టుడు, ఉత్త‌మ స‌హాయ‌న‌టి, ఉత్త‌మ స‌హాయ‌న‌టుడు, బెస్ట్ సినిమాటోగ్ర‌ఫి, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ మ్యూజిక్ (ఒరిజిన‌ల్), బెస్ట్ ప్రొడ‌క్ష‌న్ డిజైన్, బెస్ట్ సౌండ్, బెస్ట్ రైటింగ్ (అడాప్టెడ్ స్క్రీన్ ప్లే)లోనూ నామినేష‌న్స్ సంపాదించింది. దాంతో అంద‌రి చూపు ఈ సినిమావైపు సాగుతోంది. ఈ చిత్రం ప్ర‌స్తుతం నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. నామినేష‌న్స్ సంపాదించ‌గానే నెట్ ఫ్లిక్స్లో ఈ చిత్రం చూసేందుకు సినీ ఫ్యాన్స్ ఉత్సాహంతో ఉర‌క‌లు వేస్తున్నారు. 

మ‌రి ఆస్కార్ నామినేష‌న్స్ ఇన్ని సంపాదించిన ఈ చిత్రం ఎన్నిటిని ఎగ‌రేసుకు పోతుంది? ఇంత‌కూ ఈ సినిమాలోని ప‌వ‌ర్ ఏంటి అన్న చ‌ర్చ కూడా సాగుతోంది. అస‌లు ద ప‌వ‌ర్ ఆఫ్ ద డాగ్ అన్న మాట‌నే ప‌వ‌ర్ ఫుల్ అని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే ఈ వాక్యం బైబిల్ లోని కీర్త‌న‌లు (Psalms) లోనిది. Psalm 22:20 - “Deliver my soul from the sword; my darling from the power of the dog.” కింగ్ డేవిడ్ దేవుని స్తుతిస్తూ ఈ విధంగా త‌న‌కు విజ‌యాన్ని ప్ర‌సాదించ‌మ‌ని వేడుకుంటాడు. అందువ‌ల్ల ఇంగ్లిష్ వారంద‌రికీ ఈ వాక్యంతో సుప‌రిచిత‌మే! బైబిల్ వాక్యం కావ‌డం వ‌ల్లే ఈ సినిమాకు అంత ప‌వ‌ర్ వ‌చ్చింద‌నీ కొంద‌రి విశ్వాసం. ప్ర‌ముఖ అమెరిక‌న్ ర‌చ‌యిత థామ‌స్ సావేజ్ 1967లో ప్ర‌చురించిన ద ప‌వ‌ర్ ఆఫ్ ద డాగ్ న‌వ‌ల ఆధారంగానే ఈ సినిమా రూపొందింది.

ద ప‌వ‌ర్ ఆఫ్ ద డాగ్ లో మాన‌వ‌సంబంధాల లోతులు క‌నిపిస్తాయి. ప్రేమ‌, అసూయ‌, ద్వేషం, కామం వంటి స‌హ‌జ‌సిద్ధ‌మైన అంశాల‌చుట్టూ క‌థ తిరుగుతుంది. 1925 ప్రాంతంలో సాగిన క‌థ‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. ఇందులో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు ఫిల్, జార్జ్ బ‌ర్బాంక్ త‌మ ప్ర‌యాణంలో రోజ్ గోర్డాన్ అనే పూట‌కూళ్ళ‌మ్మ ఇంటికి వెళ‌తారు. ఆమె త‌న కొడుకు పీట‌ర్ తో నివ‌సిస్తూ ఉంటుంది. ఆమె భ‌ర్త చ‌నిపోయాడ‌ని, కొడుకు కోస‌మే ఆ హోట‌ల్ న‌డుపుతోంద‌ని తెలుసుకున్న జార్జ్, రోజ్ పై ప్రేమ పెంచుకుంటాడు. అయితే ఫిల్ మాత్రం త‌న దురుసు స్వ‌భావంతో పీట‌ర్ ను అవ‌మానిస్తాడు. జార్జ్, రోజ్ పెళ్లాడ‌తారు. వారితో పాటే పీట‌ర్ కూడా వెళ్తాడు. రోజ్ త‌న కొడుకు పీట‌ర్ ను మెడిసిన్ చ‌దివించాల‌ని ఆశిస్తుంది. అందుకోసం జార్జి సొమ్మును ఉప‌యోగించు కుంటుంది. కేవ‌లం డ‌బ్బు కోస‌మే జార్జ్ ను రోజ్ పెళ్ళాడింద‌ని భావిస్తాడు ఫిల్. మొత్తానికి ఆమె అంటే అత‌నికి స‌ద‌భిప్రాయం ఉండ‌దు. కానీ, అత‌ని ప్ర‌వ‌ర్త‌న కార‌ణంగా రోజ్ బాధ‌ను మ‌ర‌చిపోవ‌డానికి మ‌ద్యం అల‌వాటు చేసుకుంటుంది. పీట‌ర్ సెల‌వుల్లో త‌ల్లిని చూడ‌టానికి వ‌చ్చే స‌రికి ఆమె తాగుడుకు బానిస అయిఉంటుంది. ఫిల్, పీట‌ర్ స్నేహంగా ఉంటారు. అది చూసి రోజ్ మ‌రింత బాధ ప‌డుతుంది. ఫిల్, పీట‌ర్ ఒక‌రికొక‌రు త‌మ అనుభ‌వాల‌ను పంచుకుంటారు.

పీట‌ర్ కు ఫిల్ గుర్ర‌పు స్వారీ నేర్పిస్తాడు. గుర్రాన్ని లొంగ‌దీసుకొనే లాసో అంటే రోప్ త‌యారు చేసిస్తానంటాడు. ఆ ప‌నిలో ఉండ‌గానే ఫిల్ అనారోగ్యం పాల‌వుతాడు. అయితే చ‌నిపోయేలోగా తాను త‌యారు చేసిన లాసో ను పీట‌ర్ కు ఇవ్వాల‌నుకుంటాడు. పీట‌ర్ తిరిగి వ‌చ్చేలోగా ఫిల్ చ‌నిపోయి ఉంటాడు. అత‌ని అంతిమ సంస్కారానికి కూడా పీట‌ర్ రాలేడు. డాక్ట‌ర్ ఆంథ్రాక్స్ జ‌బ్బు వ‌ల్ల ఫిల్ చ‌నిపోయాడ‌ని చెబుతాడు. ఎంతో శుభ్రంగా ఉండే ఫిల్ కు ఆ వ్యాధి ఎలా వ‌చ్చిందో జార్జ్ కు అర్థం కాదు. త‌రువాత పీట‌ర్ ప్రార్థ‌న చేసే స‌మ‌యంలో ప్రేయ‌ర్ బుక్ లోని కీర్త‌న‌ల గ్రంథంలోని 22వ అధ్యాయంలో 20వ వ‌చ‌నంగాఉన్న “Deliver my soul from the sword, my precious life from the power of the dogs“ వాక్యం చ‌దువుతాడు. త‌రువాత రోజ్ తాగ‌డం మానేసి ఇంటికి వ‌స్తుంది. జార్జ్ ను రోజ్ కౌగిలించుకోవ‌డం పీట‌ర్ చూస్తాడు. అక్క‌డ నుండి న‌వ్వుకుంటూ అత‌ను వెళ్ళ‌డంతో క‌థ ముగుస్తుంది.

ఈ క‌థ‌లో అంద‌రినీ ఆక‌ర్షిస్తున్న అంశాలు- క‌థ‌ను ద‌ర్శ‌కుడు జేన్ క్యాంపియ‌న్ న‌డిపిన తీరు, ఈ చిత్రానికి అత‌నే స్క్రీన్ ప్లే రాశారు. మాన‌వ సంబంధాల‌న్నీ ఆర్థిక ప‌ర‌మైన‌వే అనే స‌త్యం అంత‌ర్లీనంగా బోధిస్తుందీ చిత్రం. అలాగే మాన‌వ నైజాన్ని సైతం క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్టు చూపిస్తుంది. క‌థ‌లోని ఈ అంశాలే ద ప‌వ‌ర్ ఆఫ్ ద డాగ్ వైపు అంద‌రూ చూసేలా చేస్తోంది. మ‌రి 12 విభాగాల్లో నామినేష‌న్స్ సంపాదించిన ద ప‌వ‌ర్ ఆఫ్ ద డాగ్ మార్చి 27న జ‌రిగే ఆస్కార్ అవార్డుల ప్ర‌దానోత్స‌వంలో ఎన్నిటిని కైవ‌సం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version