డాన్స్ లో గ్రేస్, డైలాగ్ డెలివరీలో స్టైల్, ఫైట్స్ లో మాస్… చిరు పేరు వినగానే గుర్తొచ్చే విషయాలు ఇవి. మెగాస్టార్ చిరంజీవి మాస్ సినిమా చేస్తే థియేటర్స్ దగ్గర ఆడియన్స్ క్యు కడతారు. ‘బుక్ మై షో’ వచ్చి అందరూ ఆన్లైన్ లో సినిమా టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు కానీ ఒకప్పుడు చిరు సినిమా రిలీజ్ అయితే టికెట్స్ కోసం థియేటర్స్ దగ్గర చొక్కాలు చింపుకునే వాళ్లు. అంతటి మాస్ ఫాన్స్ ని సొంతం చేసుకున్న చిరు, తన కంచుకోట లాంటి మాస్ జనార్ లోకి మళ్లీ అడుగు పెడుతూ చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ కూడా గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడు.
2023 సంక్రాంతికి విడుదల కానున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టిన చిత్ర యూనిట్, మొదటి పాట ‘బాస్ పార్టీ’ని ఇటివలే రిలీజ్ చేశారు. దేవి లిరిక్స్ రాసి కంపోజ్ చేసిన ఈ బాస్ పార్టీ సాంగ్ టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఈ పాటలో చిరు వేసిన ‘హుక్ స్టెప్’కి మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇన్నేళ్లు అవుతున్నా చిరు డాన్స్ లో మ్యాజిక్ తగ్గలేదు అంటూ కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు. ఈ బాస్ పార్టీ సాంగ్ విన్న వాళ్లు ఇదేంటి, పాట కేవలం మూడు నిమిషాలే ఉందంటూ షాక్ అవుతున్నారు. మాములుగా ఒక పాట నిడివి నాలుగు నుంచి నాలుగున్నర నిమిషాల పాటు ఉంటుంది, కొన్ని సార్లు ఇది అయిదు నిమిషాల వరకు కూడా వెళ్తుంది.
అసలే మాస్ పాట పైగా బాసు పాట కనీసం నాలుగున్నర నిముషాలు కూడా లేకుండా మూడు నిమిషాలకే ముగించారు అంటూ చాలా మంది నిరాశ చెందారు. అయితే లిరికల్ వీడియోలో బాస్ పార్టీ మూడు నిమిషాలే ఉంది కానీ వీడియో సాంగ్ లో నిడివి ఎక్కువే ఉంటుందట. కావాలనే మేకర్స్ కొంత బిట్ ని కట్ చేశారని సమాచారం. బాస్ పార్టీ లిరికల్ సాంగ్ లో కట్ చేసిన బిట్ లో ఒక మెగా సర్ప్రైజ్ ఉందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. చిరంజీవి నటించిన ‘ముఠా మేస్త్రి’ సినిమాలోని ‘ఈ పేటకి నేనే మేస్త్రి’ అనే సాంగ్ ఉంటుంది. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ పాటలో చిరు ఒక ‘ఐకానిక్ స్టెప్’ వేస్తాడు. ఇప్పటికీ అంత అందంగా ఆ స్టెప్ వేసిన వాళ్లు లేరు. ఈ ఐకానిక్ స్టెప్ ని ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోని ‘బాస్ పార్టీ’ వీడియో సాంగ్ లో చూపించబోతున్నారట. ఇదే జరిగితే వింటేజ్ చిరుని చూసి మెగా అభిమానులు థియేటర్స్ టాప్ లేపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.