కోలీవుడ్ యంగ్ హీరో విశాల్ కి టాలీవుడ్ లోను ఫ్యాన్ బేస్ ఎక్కువే. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక తాజాగా ‘సామాన్యుడు’ చిత్రంతో మరోసారి హిట్ కొట్టడానికి రెడీ అయిపోయాడు విశాల్. తూ.పా. శరవణన్ దర్శకత్వంలో విశాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘సామాన్యుడు.. నాట్ ఏ కామన్ మ్యాన్’ అనేది ట్యాగ్ లైన్. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ” నీకో మంచి క్రైమ్ స్టోరీ చెప్పనా అంటూ విశాల్ వాయిస్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. పోలీసాఫీసర్ అవ్వాలనుకునే హీరో.. ఒక క్రైమ్ ని ఏ విధంగా చూడాలి అనే రీసెర్చ్ లో ఉంటాడు. ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్ తో హ్యాపీ గా సాగుతున్న అతని జీవితంలోకి అనుకోని వ్యక్తులు తారసపడతారు. వారి వలన ఎంతోమంది సఫర్ అవుతూ ఉన్నట్లు చూపించారు. చివరిగా వారివలన హీరో సఫర్ అవ్వడం, వారిపై ఎదురుతిరగడం కనిపిస్తోంది.
ఇక ఆ అన్యాయానికి ఒక సామాన్యుడు ఎదురు తిరిగితే.. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది కథగా తెలుస్తోంది. చివర్లో “నేను ఒక సామాన్యుడిని.. ఎదురుతిరగకపోతే నన్ను కూడా చంపేస్తారు” అని విశాల్ చెప్పడంతో ట్రైలర్ ముగుస్తుంది. ట్రైలర్ మొత్తం విశాల్ యాక్షన్ తో నింపేశారు. ఇక డింపుల్ హయతి తో విశాల్ రొమాన్స్ కొద్దిగా హద్దు దాటి చూపించినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ సినిమా ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించడమే కాక అంచనాలను కూడా పెంచేసింది. ఇక నిన్నటి వరకు 2022 జనవరి 26 విడుదల అని పోస్టర్స్ వదిలిన చిత్ర బృందం.. ఇప్పుడు కొత్త పోస్టర్స్ లో ‘త్వరలో థియేటర్లలోకి రాబోతోంది’ అని తెలుపడంతో ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.