Virupaksha: ఈ మధ్య కాలంలో తెలుగు చిత్రసీమకు కాస్తంత ఊపిరి పోసిన సినిమా ఏదైనా ఉందంటే అది ‘విరూపాక్ష’. సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ కీలక పాత్రలు పోషించిన ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ను దర్శకుడు కార్తీక్ దండు చక్కగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాడు. కామెడీ కోసం పక్కదారులు పట్టకుండా… సింగిల్ ఎజెండాతో మూవీని తెరకెక్కించాడు. పాన్ ఇండియా ఈ సినిమాను మొదట్లో రిలీజ్ చేయాలని అనుకున్నా… నిర్మాత బి.వి.యస్.ఎన్. ప్రసాద్ మొదట తెలుగు వర్షన్ మీద దృష్టి పెట్టారు. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలైన ‘విరూపాక్ష’కు మంచి మంచి ఓపెనింగ్స్ రావడమే కాదు… ఆ తర్వాత కూడా బెటర్ రన్ ను ప్రదర్శిస్తోంది. ఇవాళే రెండో వారంలోకి అడుగుపెట్టిన ‘విరూపాక్ష’ మొదటివారంలో ప్రపంచ వ్యాప్తంగా రూ. 62.5 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని నిర్మాత తెలిపారు. విశేషం ఏమంటే… తెలుగులో సక్సెస్ కావడం ఈ సినిమా ఇతర రాష్ట్రాలలో విడుదలకు మార్గాన్ని సుగమం చేసింది. తమిళంలో దీనిని జ్ఞానవేల్ రాజాకు చెందిన స్టూడియో గ్రీన్, హిందీలో ప్రముఖ పంపిణీ సంస్థ గోల్డ్ మైన్, మలయాళంలో ఇ4 సంస్థలు విడుదల చేయబోతున్నాయి. అతి త్వరలోనే ‘విరూపాక్ష’ను ఇతర భాషల్లో ఎప్పుడు విడుదల చేసేది చెబుతామంటున్నారు నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్.