తమిళంలో మంచి విజయం సాధించిన ‘వినోదయం సీతమ్’ను తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే! ఒరిజినల్‌కి దర్శకత్వం వహించడంతో పాటు అందులో ప్రధాన పాత్రలో నటించిన సముద్రఖని ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకు పవన్ 20 రోజుల డేట్స్ ఇచ్చినట్టు గతంలోనూ వార్తలొచ్చాయి. అయితే, ఇది ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందన్నదే స్పష్టత రాలేదు. అదిగో, ఇదిగో అంటూ.. యూనిట్ సభ్యులు చెప్పడమే తప్ప, ఇంతవరకూ పట్టాలెక్కలేదు. నిజానికి.. భీమ్లా నాయక్ రిలీజైన వెంటనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. అందుకు సంబంధించిన పనులు కూడా చకచకా నడుస్తున్నాయని, త్రివిక్రమ్ మాటలతో పాటు స్క్రీన్‌ప్లే సిద్ధం చేస్తున్నాడని ప్రచారం జరిగింది. అంటే, ఆ తర్వాత మళ్లీ ఎలాంటి అప్డేట్స్ రాలేదు.
ఇప్పుడు తాజాగా వినిపిస్తోన్న వార్తల ప్రకారం.. ఈ సినిమా షూటింగ్‌కి ముహూర్తం ఖరారు చేశారట! జులై నుంచే ‘వినోదయ సీతమ్’ రీమేక్‌ను పట్టాలెక్కించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ విషయమై అధికార ప్రకటన కూడా రానుందట! స్క్రిప్ట్ వర్క్ దాదాపు తుది దశకు చేరుకోవడం, ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా చకచకా ముగియడంతో.. ఇక సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట! ఈ చిత్రానికి పవన్ 18-20 రోజుల డేట్స్ కేటాయించాడని, అతనికి సంబంధించిన పోర్షన్ ఆ వ్యవధిలోనే ముగించనున్నారని తెలిసింది. ఇందులో సాయి ధరమ్ తేజ్ కూడా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. కృతి శెట్టి, శ్రీలీలాలను కథానాయిక పాత్ర కోసం పరిశీలిస్తున్నారని.. ఇద్దరిలో ఎవరో ఒకర్ని త్వరలోనే ఫైనల్ చేయనున్నారని తెలిసింది. వీలైనంత త్వరగా ముగించి, ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తు్న్నారు.