NTV Telugu Site icon

Varasudu: అఫీషియల్.. విజయ్ ‘వారసుడు’ తెలుగు వెర్షన్ రిలీజ్ వాయిదా

Varasudu

Varasudu

Varasudu: దళపతి విజయ్ నటించిన వారసుడు సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్‌పై సందిగ్ధత వీడిపోయింది. గతంలో సంక్రాంతి కానుకగా ఈనెల 11న ఈ మూవీ విడుదలవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఇప్పటివరకు బుకింగ్ యాప్స్‌లో ఈ సినిమా కనిపించకపోవడంతో అభిమానులు గందరగోళానికి గురయ్యారు. ఇంకా రెండు రోజుల సమయమే ఉన్నా టిక్కెట్లు అందుబాటులో లేకపోవడంతో ఈ సినిమా విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాజాగా వారసుడు తెలుగు వెర్షన్‌ రిలీజ్ వాయిదా పడినట్లు నిర్మాత దిల్ రాజు అఫీషియల్‌గా ప్రకటించారు. తమిళంలో మాత్రం ఈనెల 11నే వారసుడు విడుదలవుతుండగా.. తెలుగులో మాత్రం ఈనెల 14న విడుదల చేస్తున్నట్లు వివరించారు. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోని పెద్ద‌ల‌తో డిస్క‌స్ చేసిన త‌ర్వాతే సినిమాను రెండు రోజులు ఆల‌స్యంగా విడుద‌ల చేయాల‌నే నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు వెల్ల‌డించాడు. ఒక అడుగు వెన‌క్కి వేశాన‌నే బాధ లేద‌ని తెలిపాడు.

Read Also: Gold Rates High Live: బంగారం ధరల పెరుగుదల.. ఎందుకంటే?

ఈ సినిమాపై తమకు 100 శాతం నమ్మకం ఉందని.. గతంలో తమ బ్యానర్ నుంచి సంక్రాంతికి వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు, శతమానంభవతి, ఎఫ్ 2 సినిమాల మాదిరిగా వారసుడు కూడా విజయం సాధిస్తుందని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు. వారసుడు మూవీ కూడా దిల్ రాజు బ్రాండ్ తరహాలో ఉంటుందన్నారు. కుటుంబ కథా చిత్రమే అయినా ఈ మూవీలో ఓ కొత్త పాయింట్ ఉంటుందని.. సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ ఈ పాయింట్‌ను మాత్రమే గుర్తుంచుకుంటారని దిల్ రాజు అన్నారు. రెండు మాస్ సినిమాలు పోటీగా రిలీజ్ కానుండ‌టంతోనే దిల్‌రాజు తెలుగు వెర్షన్ విష‌యంలో కొంత వెన‌క్కి త‌గ్గిన‌ట్లు ప్రచారం జరుగుతోంది. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన వార‌సుడు సినిమాలో విజయ్ సరసన ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీకాంత్, శ‌ర‌త్‌కుమార్‌, కిక్ శ్యామ్, సంగీత , జ‌య‌సుధ‌, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.