Vijay Setupathi: అంత అత్యద్భుతమైన పర్సనాలిటీ ఏమీ కాదు… చూడగానే ఏదో మన పక్కింటివాడిలానో, లేదా వీధిలో తారసపడిన సామాన్యుడిగానో కనిపిస్తాడు విజయ్ సేతుపతి. కానీ, తనకు లభించిన పాత్రలోకి ఇట్టే పరకాయ ప్రవేశం చేయగలరు. ఆట్టే నటనతో మార్కులూ కొట్టేయగలరు. ఆ ప్రతిభతోనే జనాన్ని అప్రతిభులను చేసి విజయ సేతుపతి విజయపథంలో పయనిస్తున్నారు. అనేక విలక్షణమైన పాత్రల్లో తనదైన బాణీ పలికించిన విజయ్ సేతుపతి తెలుగు చిత్రాలలోనూ అవకాశం చిక్కినప్పుడల్లా నటిస్తున్నారు. తమిళనాట తనదైన బాణీ పలికిస్తూ బిజీగానే సాగుతున్నారు.
విజయ్ సేతుపతి 1978 జనవరి 16న తమిళనాడులోని రాజాపాళయంలో జన్మించారు. అతను ఆరో తరగతి చదువుతూ ఉండగా, వారి కుటుంబం చెన్నై మకాం మార్చింది. అక్కడే కోడంబాక్కంలోని ‘ఎమ్జీఆర్ హయ్యర్ సెకండరీ స్కూల్’లోనూ, తరువాత లిటిల్ ఏంజెల్స్ స్కూల్ లోనూ చదివారు సేతుపతి. చదువుకొనే రోజుల్లోనే సినిమాలంటే పిచ్చి. ఎలాగైనా తెరపై కనిపించాలన్న అభిలాష ఉండేది. దాంతో 16 ఏళ్ళ వయసులోనే ‘నమ్మవర్’ అనే సినిమా ఆడిషన్స్ కు వెళ్ళారు సేతుపతి. అయితే ఆయన ఎత్తుగా లేకపోవడం వల్ల అవకాశం రాలేదు. జీవనోపాధి కోసం సేల్స్ మేన్ గా, టెలిఫోన్ బూత్ ఆపరేటర్ గా పనిచేశారు. అలాగే బి.కామ్, పట్టా పుచ్చుకున్నారు. ఏ ఉద్యోగమూ ఆయనకు సంతృప్తి కలిగించలేదు. ఆ సమయంలో ప్రముఖ దర్శకులు, సినిమాటోగ్రాఫర్ బాలూ మహేంద్ర ‘నీకు ఫోటోజెనిక్ ఫేస్ ‘ ఉందని ప్రోత్సహించారు. అయితే బాలూమహేంద్ర దర్శకత్వంలో నటించక పోయినా, విజయ్ సేతుపతికి ఆయన మాటతో ఆత్మస్థైర్యం కలిగింది. కొన్ని చిత్రాలలో బిట్ రోల్స్ లో కనిపించారు సేతుపతి. ‘నాన్ మహాన్ అల్ల’లో గణేశ్ అనే పాత్రలో నటించారు. ‘తెన్ మెర్కు పరువ కాట్రు’లో కీలక పాత్రతో గుర్తింపు లభించింది. ఆ తరువాత ‘సుందర పాండియన్’లో విలన్ గా నటించి మరింత పేరు సంపాదించారు విజయ్ సేతుపతి. ‘పిజ్జా’ చిత్రంలో మైఖేల్ గా నటించి, జనానికి మరింత చేరువయ్యారు. ఆ తరువాత మరి వెనుదిరిగి చూసుకోలేదు విజయ్ సేతుపతి.
తన దరికి చేరిన ప్రతీ అవకాశాన్నీ వినియోగించుకుంటూ ముందుకు సాగారు విజయ్ సేతుపతి. హీరో వేషాలే వేస్తానని భీష్మించుకు కూర్చోలేదు. తన దరికి చేరిన ప్రతీ పాత్రకు న్యాయం చేయాలని తపించారు. ‘సేతుపతి’లో హీరోగా నటించి, అభిమానులనూ సంపాదించుకున్నారు. మణిరత్నం ‘చెక్క చివంత వనం’లో ఇన్ స్పెక్టర్ రసూల్ ఇబ్రహీమ్ గా తనదైన అభినయంతో అలరించారు. త్రిష సరసన ’96’లో హీరోగా నటించీ మెప్పించారు విజయ్. రజనీకాంత్ ‘పేట్ట’లో జీతూగా, చిరంజీవి ‘సైరా.. నరసింహారెడ్డి’లో రాజా పాండిగా, విజయ్ ‘మాస్ఠర్’లో విలన్ గా, ‘ఉప్పెన’లో ప్రతినాయకునిగా, కమల్ హాసన్ ‘విక్రమ్’లోనూ విలన్ గా తనదైన బాణీ పలికించారు విజయ్ సేతుపతి.
ప్రస్తుతం నాలుగు తమిళ చిత్రాలలోనూ, షారుఖ్ ఖాన్ ‘జవాన్’ హిందీ చిత్రంతో పాటు సంతోష్ శివన్ ‘ముంబైక్కర్’ అనే మరో హిందీ సినిమాలోనూ విజయ్ నటిస్తున్నారు. ఈ చిత్రాలలో విజయ్ సేతుపతి అభినయం ఏ తీరున అభిమానజనాలను మురిపిస్తుందో చూడాలి.