Vijay Sethupathi: తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్‌గా మారారు. బిగ్‌బాస్ వేదికపై ఆయన చేసిన కొన్ని వైరల్ కామెంట్స్ కోలీవుడ్‌లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆ కామెంట్లు నేరుగా సీఎం విజయ్‌ను ఉద్దేశించినవేనంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ప్రచారం జరిగింది. ఇద్దరు అగ్ర నటుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయంటూ ఊహాగానాలు వెల్లువెత్తిన వేళ, వీటన్నింటికీ విజయ్ సేతుపతి ఒకే ఒక్క దెబ్బతో తెరదించారు. అంతేకాదు సూపర్ స్టార్ రజనీకాంత్ అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘జైలర్ 2’లో తన పాత్రపై అఫీషియల్ అప్‌డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు.
ఇటీవల బిగ్‌బాస్ హోస్ట్‌గా సేతుపతి మాట్లాడిన మాటలు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అవి నేరుగా సీఎం విజయ్‌ను టార్గెట్ చేస్తూ అన్న మాటలేనంటూ పెద్ద ఎత్తున విమర్శలు మూటగట్టుకున్నారు. అయితే ఈ వివాదాలపై తాజాగా ఓ వేదికపై స్పందించిన విజయ్ సేతుపతి.. దళపతి విజయ్‌తో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని పంచుకుంటూ పుకార్లకు చెక్ పెట్టారు. “ఒకసారి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ బర్త్ డే సందర్భంగా నేను ఫోన్ చేసి విషెస్ చెప్పాను. అది గమనించిన విజయ్ సర్ నేరుగా నాకే ఫోన్ చేశారు. ‘డియర్ ఫ్రెండ్’ అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. మీరు విష్ చేయడం మా అబ్బాయికి ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. అంతటి తిరుగులేని సూపర్ స్టార్ స్థాయి ఉన్న వ్యక్తి నుంచి అలా ఫోన్ రావడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన అంత పెద్ద స్టార్ అయినా వ్యక్తిగతంగా ఎంతో నిరాడంబరంగా ఉంటారు” అంటూ విజయ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మక్కల్ సెల్వన్. దీంతో వీరిద్దరి మధ్య వైరం ఉందంటూ వస్తున్న వార్తలన్నీ కేవలం రూమర్స్ అని తేలిపోయింది. మరోవైపు, సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్ ‘జైలర్ 2’ గురించి విజయ్ సేతుపతి సంచలన ప్రకటన చేశారు. ఈ సీక్వెల్‌లో తాను కూడా భాగమైనట్లు స్వయంగా ప్రకటించారు. ఈ సినిమాలో అతిథి పాత్రలో ఒక చిన్న సీన్‌లో మాత్రమే కనిపిస్తానని స్పష్టం చేశారు. కేవలం చిన్న సన్నివేశమే అయినప్పటికీ, రజనీకాంత్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకెంతో స్పెషల్ అన్నారు.

