Vijay Setupathi:కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. మంచి పాత్ర అయితే చాలు.. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చివరికి గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వమన్న ఓకే చెప్పేస్తాడు. ఇక విజయ్ పాత్రకు ప్రాణం పోస్తాడు. హావభావాలను మాత్రమే కాదు ఆ పాత్రకు తగ్గట్టు మారిపోతాడు. విలన్ గా కనిపించడానికి బరువు పెరుగుతాడు.. వెంటనే హీరోగా కనిపించడానికి సన్నబడతాడు. ఇక విక్రమ్ సినిమాలో సంతానం పాత్రలో విజయ్ నటన అద్భుతం. అందులో ముగ్గురు భార్యల ముద్దుల మొగుడిగా పొట్ట వేసుకొని, బంగారు పన్ను పెట్టుకొని షాక్ ఇచ్చాడు.
ఇక ఇదే లుక్ లో ఉన్న విజయ్ తాజాగా తన కొత్త సినిమా కోసం లుక్ మార్చాడు. ఈ కొత్త మేకోవర్ అదిరిపోయింది. విజయ్ ను సడెన్ గా చూస్తే కొద్దిగా గుర్తుపట్టడం కష్టమే అనుకోవచ్చు. పూర్తిగా బరువు తగ్గి అల్ట్రా స్టైలిష్ లుక్ లోకి మారిపోయాడు. వైట్ షర్ట్, పెద్ద కళ్లద్దాలతో చిరునవ్వులు చిందిస్తూ విజయ్ సెల్ఫీ ఆకట్టుకొంటుంది. అయితే ఈ లుక్ ఏ సినిమాకోసమో అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా విజయ్ స్లిమ్ లుక్ మాత్రం ఓరేంజ్ లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.