NTV Telugu Site icon

Vijay Deverakonda: ముంబైలో ‘మ్యూజిక్ స్కూల్’ ట్రైలర్ ఆవిష్కరణ!

Music School

Music School

Music School: శ్రియా శరణ్‌, శర్మన్‌ జోషి, ప్రకాష్‌రాజ్‌ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘మ్యూజిక్ స్కూల్’. పాపారావు బియ్యాల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ముంబైలో జరిగింది. దర్శకనిర్మాత పాపారావు బియ్యాల, శ్రియా శరణ్‌, శర్మన్‌ జోషి, గ్రేసీ గోస్వామి, ఓజు బారువా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రైలర్‌ని విజయ్‌ దేవరకొండ డిజిటల్‌గా ఆవిష్కరించారు. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. దాని ప్రకారం శ్రియా శరణ్‌, శర్మన్ జోషి సంగీత, నృత్య ఆచార్యులుగా నటించారు. గ్రేసీ గోస్వామి, ఓజు బారువాతో పాటు మరికొంత మందికి ‘ది సౌండ్‌ ఆఫ్ మ్యూజిక్‌’ పేరుతో ఓ మ్యూజికల్‌ ప్లేని ఏర్పాటు చేస్తారు. సమాజం, టీచర్లు, తల్లిదండ్రులు పిల్లలపై పెంచుతున్న ఒత్తిడి నుంచి కాస్త రిలీఫ్‌ ఇవ్వడం కోసం మ్యూజిక్‌, డ్యాన్స్ టీచర్లు చేసిన ప్రయత్నం మెప్పిస్తోంది. మ్యూజికల్‌ జర్నీలా ఈ మూవీ అనిపిస్తోంది. వినోదం, భావోద్వేగాలు, సంగీతం మిళితమై అందమైన ప్యాకేజ్‌లా కనిపిస్తోంది ట్రైలర్‌. గోవా పరిసరాల్లోని అత్యద్భుతమైన లొకేషన్లు కన్నులవిందు కలిగిస్తున్నాయి.
ప్యాషన్‌తో ఫిల్మ్ మేకర్‌గా మారిన ఐఏయస్‌ ఆఫీసర్‌ పాపారావు బియ్యాల ఈ మూవీ గురించి మాట్లాడుతూ, “నేటి తరం విద్యార్థుల మీద తల్లిదండ్రులు, గురువులు, సమాజం మోపుతున్న ఒత్తిడిని సున్నితంగా, అర్థవంతంగా, సంగీత ప్రధానంగా చెప్పే ప్రయత్నమే ‘మ్యూజిక్‌ స్కూల్‌’. ఈ సినిమాలో పదకొండు పాటలున్నాయి. భారతీయ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఇందులోని మూడు పాటలను, అత్యద్భుతమైన సౌండ్‌తో డిజైన్‌ చేశారు. “పడ్తో జావో బచ్చా, తేరి నిగాహో నే, హాచ్‌కౌలే” అనే పాటలను ఆ మధ్య విడుదల చేశారు” అని అన్నారు.
ఇందులో బెంజమిన్‌ గిలానీ, సుహాసిని మూలే, మోనా అంబేగోయంకర్‌, లీలా సామ్‌సన్‌, బగ్స్ భార్గవ, వినయ్‌ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్‌, వాక్వార్‌ షేక్‌, ఫణి ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. పలువురు బాల నటీనటుల్ని ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని యామిని ఫిల్మ్స్ హిందీ, తెలుగు భాషల్లో నిర్మించింది. దీన్ని తమిళంలోకి అనువదించారు. మే 12న హిందీ, తమిళంలో పీవీఆర్ సంస్థ ద్వారాను, తెలుగులో ‘దిల్‌’ రాజు ద్వారాను ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది.