Vijay Antony Vikram Rathod First Look Released: మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత హీరోగా మారాడు విజయ్ ఆంటోనీ. ఇక అలా నటుడిగా కెరీర్ మొదటి నుంచి వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ బిజీగా మారారు. తనదైన విలక్షణ నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ముందుకు సాగుతున్న ఆయన రీసెంట్ గానే బిచ్చగాడు 2 సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు కూడా జోష్ లో ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. విజయ్ ఆంటోని హీరోగా విక్రమ్ రాథోడ్ అనే సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అపోలో ప్రొడక్షన్స్, SNS మూవీస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాబు యోగేశ్వరన్ దర్శకత్వం వహిస్తుండగా రావూరి వెంకటస్వామి, S కౌసల్య రాణి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో ముఖంపై గాయాలతో కనిపిస్తున్న విజయ్ ఆంటోనీ సీరియస్ లుక్ లో కనిపిస్తుండటం, ఎవరో గన్ తో ఆయనకు గురిపెట్టడం చూపిస్తూ సినిమా పట్ల ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేశారు. శ్రీ శివ గంగ ఎంటర్ ప్రైజెస్ సంస్థ (K బాబు రావు) ఈ సినిమాను రిలీజ్ చేయబోతోంది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి కావడంతో అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విక్రమ్ రాథోడ్ సినిమాలో సురేష్ గోపి, రమ్యా నంబీశన్, సోను సూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. ఛాయా సింగ్, యోగి బాబు, రాధ రవి, కస్తూరి శంకర్, రోబో శంకర్, మనీష్ కాంత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.