ప్రపంచవ్యాప్తంగా అత్యధిక యువతీయువకులకు నేడు ఆసక్తి కలిగిస్తోన్న అంశమేది అంటే సినిమా అని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఒకప్పుడంటే సినిమా అనేది పిచ్చి అనేవారు. నేడు సినిమా కూడా ఓ విద్యగా మారింది. అయితే అందరూ సినిమా పరిజ్ఞానం సంపాదించి, చిత్రాలు రూపొందించే స్థాయిలో లేరు. ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ తమ ‘ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫిలిమ్ అండ్ కల్చర్’ ఆధ్వర్యంలో ‘స్క్రీన్ కల్చర్ ల్యాబ్’ నెలకొల్పారు. ఔత్సాహికులైనవారికి ఓ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులైన వారి ఇళ్ళకు సంస్థ అధికారులు వెళ్ళి, వారు నిజంగా ఆర్థికంగా వెనుకబడినవారా? కాదా అన్న అంశాలపై పరీక్షిస్తారు.
వెట్రిమారన్ చిత్రాలు ఎంతో వైవిధ్యంతో రూపొందుతాయి. ఆయన సినిమాల్లాగే వెట్రిమారన్ సైతం విలక్షణమైన వ్యక్తిత్వం గలవారు. ఆయన దర్శకత్వంలో ధనుష్ నటించిన “పొల్లాదవన్, ఆడుకాలం, విసారణై, అసురన్” వంటి చిత్రాలు విశేషాదరణ చూరగొన్నాయి. ధనుష్ ను జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగానూ నిలిపాయి. అదే తీరున వెట్రిమారన్ కు సైతం ఎనలేని పేరు సంపాదించి పెట్టాయి. తనలాగే సృజనాత్మక శక్తి కలిగి, సరైన అవకాశాలు లేని వారి కోసమే వెట్రిమారన్ ఈ ‘స్క్రీన్ కల్చర్ ల్యాబ్’ నెలకొల్పారు.
ఔత్సాహికులైనవారిలో నిజంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి శిక్షణ ఇచ్చే సమయంలో తగిన ఆహార,వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తామని వెట్రిమారన్ తెలిపారు. శిక్షణ పొందినవారు ఈ మాధ్యమంలో రాణించడానికి వారి ప్రతిభను బట్టి అవకాశాలూ కల్పిస్తామని ఆయన చెప్పారు. ‘స్క్రీన్ కల్చర్ ల్యాబ్’ ప్రారంభోత్సవంలో ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్.థాను పాల్గొనడమే కాదు, రూ.1 కోటి విరాళాన్ని వెట్రిమారన్ తల్లి మేఘలా చిత్రవేల్ చేతుల మీదుగా చెక్ ను అందజేశారు. వెట్రిమాన్ ఎంపిక చేసిన విద్యార్థి/ విద్యార్థినికి తమ ‘వి’ క్రియేషన్స్ నిర్మించే చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశం కల్పిస్తామనీ థాను తెలిపారు. సంస్థ ప్రారంభోత్సవంలో సంస్థ ట్రస్టీలు ఆర్తి వెట్రిమారన్, వెట్రి దొరైసామి, లయోలా కాలేజ్ విశ్రాంత అధ్యాపకులు రాజా నాయకమ్ తదితరులు పాల్గొన్నారు. మరి మన సినిమాను బలోపేతం చేయడానికి వెట్రిమారన్ తలపెట్టిన ఈ చేయూతను ఎంతమంది అందిపుచ్చుకుంటారో చూడాలి.