Allari Naresh:’అల్లరి’ నరేశ్ తాజా చిత్రం ‘ఉగ్రం’ ఈ నెల 5న జనం ముందుకు వస్తోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ సినిమా నిర్మించారు. ఈ మూవీ గురించి నరేశ్ చెప్పిన విశేషాలు తెలుసుకుందాం. ఈ సినిమా సక్సెస్ మీద తన కున్న నమ్మకాన్ని నరేశ్ వ్యక్తం చేస్తూ, “సక్సెస్ పై చాలా నమ్మకంగా వున్నాను. ‘ఉగ్రం’ సినిమా చూసిన తర్వాత ప్రతి క్రాఫ్ట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. శ్రీచరణ్ దాదాపు రెండున్నర నెలలు కష్టపడి చాలా కొత్త సౌండ్ ఇచ్చాడు. అలాగే బ్రహ్మ కడలి, సిద్, చోటా కె. ప్రసాద్, అబ్బూరి రవి… ఇలా అందరం కలసి టీం వర్క్ చేశాం. ‘నాంది’ తర్వాత టీం అందరిపై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలు అందుకోవడం కోసం పదింతలు కసిగా పని చేశాం” అని చెప్పారు.
తాను ఇంతవరకూ చేసిన కామెడీ, యాక్షన్ రోల్స్ గురించి చెబుతూ, “కామెడీ చేయడం చాలా కష్టం. కామెడీ చేసేవారు ఏదైనా చేయగలుగుతారు. ‘రంగమార్తాండ’లో బ్రహ్మనందం గారు, ‘విడుదల’లో సూరి లను అందరూ వెల్ కమ్ చేశారు. ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ‘ఉగ్రం’ విషయానికి వస్తే దర్శకుడు విజయ్ నా ప్లస్ ల కంటే మైనస్ లు ముందుగా చెప్పేశాడు. పోలీస్ పాత్రకు నా ఎత్తు పొడుగు ఓకే. అయితే నా కంటే ఎత్తు తక్కువ వున్న వాళ్ళతో చేసినప్పుడు నేను ఒంగి మాట్లాడతానని, వరుసగా కామెడీ సినిమాలు చేయడం వలన బాడీ లాంగ్వేజ్ తెలియకుండానే అటు వైపు వెళుతుందని, పాత నరేష్ కనిపిస్తే ఆడియన్స్ డిస్ కనెక్ట్ అయిపోతారని.. వీటన్నిటిని అధిగమించాలని ముందే వివరంగా చెప్పాడు. చాలా జాగ్రత్తలు తీసుకొని, కంట్రోల్ చేసి ‘ఉగ్రం’ చేశాను.
ఇందులో మూడు వేరియేషన్స్ లో వుండే పాత్రలో నేను కనిపిస్తాను. ఐదేళ్ళ టైం లిమిట్ లో కథ సాగుతుంది. ఎస్సై శిక్షణ వుండగా ఒక అమ్మాయిని ప్రేమించడం, తర్వాత పెళ్లి, ఒక కూతురు పుడుతుంది. పెళ్లి తర్వాత బరువు పెరుగుతారని నా బరువు కూడా కాస్త పెంచాడు విజయ్. మొదట సిఐ, తర్వాత ఎస్ఐ, చివర్లో షార్ట్ హెయిర్ వున్న పాత్ర చేయడం జరిగింది” అని వివరించారు.
గతంలో చేసిన ఇలాంటి పాత్రలను తలుచుకుంటూ, ఆ క్రెడిట్ మొత్తం దర్శకులకే చెందుతుందని నరేశ్ అన్నారు. “క్రిష్ గారి నమ్మకంతో ‘గమ్యం’ వచ్చింది. సముతిర కని గారి నమ్మకంతో ‘శంభో శివ శంభో’ వచ్చింది. ఇప్పుడు విజయ్ నమ్మకంతో “నాంది, ఉగ్రం” వచ్చాయి. దర్శకుడు నమ్మితే దాని రిజల్ట్ వేరేలా వుంటుంది. ఇంత ఇంటెన్స్ రోల్ చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఈ క్రెడిట్ అంతా విజయ్ కి వెళుతుంది” అని చెప్పారు. ఈ చిత్ర నిర్మాతల గురించి చెబుతూ, “సాహు, అర్చన భార్యభర్తలు. నేను పరిశ్రమలోకి రాకముందే నాకు తెలుసు. వాళ్ళ కాలేజ్ ప్రేమ కథ కూడా తెలుసు. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. సుడిగాడు సమయంలో సాహు సినిమా చేద్దామని వచ్చాడు . అప్పుడు చాలా చిన్నోడు. తనకి సినిమా లాభనష్టాలు గురించి చెప్పి వద్దు అన్నాను.
తను ప్రయత్నం ఆపలేదు. ఈ రోజు సక్సెస్ ఫుల్ నిర్మాత కావడం ఆనందంగా వుంది. అలాగే హరీష్ కూడా చాలా మంచి వ్యక్తి. ఎక్కడా రాజీపడకుండా సినిమాని చేశారు. అలాగే ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు” అని అన్నారు.
సీక్వెల్స్ ఆలోచన గురించి చెబుతూ, “‘సుడిగాడు’ పార్ట్ 2 తీయొచ్చు, అనిల్ రావిపూడి ‘సుడిగాడు’కి పని చేశారు. మొన్న కలసినపుడు పార్ట్ 2 చేద్దామా అన్నారు. నేను రూటు మార్చి ఇటు వస్తే మళ్ళీ అటు తీసుకెళ్తారా? అని సరదాగా మాట్లాడుకున్నాం. అలాగే నాన్న గారి చివరి రోజుల్లో ‘ఆలీబాబా అరడజను దొంగలు’కి సీక్వెల్ గా ‘ఆలీబాబా డజను దొంగలు’ చేద్దామని అనుకున్నాం. కానీ కుదరలేదు. ఇక ఉగ్రం విషయానికి వస్తే… దీనికి సీక్వెల్ ఉండదు. బట్ ‘నరేశ్-విజయ్ 3’ మాత్రం ఉంటుంది. దానికి ఓ లుక్ కూడా అనుకున్నాం. వచ్చే ఏడాది ఉండొచ్చు. ఈ సినిమా తర్వాత ఒక కామెడీ సినిమా చేస్తున్నాను. కామెడీ వదలడం లేదు. నేను ఆడా వుంటా.. ఈడా వుంటా” అని చెప్పారు. నరేశ్ ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో ఫరియా అబ్దులా హీరోయిన్ గా ఓ సినిమా చేస్తున్నారు. అలానే ‘జెండా’ అనే కథను కొన్నానని, దానిని తానే నిర్మిస్తానని, దర్శకుడు ఇంకా ఖరారు కాలేదని నరేశ్ చెప్పారు.