Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!

Ak 47

Ak 47

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం – AK47’ టీజర్ నెట్టింట తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఒక స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రానికి ‘ఏకే 47’ అనే గన్ పేరును టైటిల్‌గా జోడించడం ద్వారా.. సినిమాలో త్రివిక్రమ్ మార్క్ మ్యాజిక్ ఏ స్థాయిలో ఉండబోతోందో ఈ టీజర్ స్పష్టం చేసింది. మధ్యతరగతి ఇళ్లలో జరిగే సరదా సంఘటనలతో మొదలైన ఈ గ్లింప్స్.. వెంకీ వింటేజ్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ పదునైన పంచ్ డైలాగ్స్, ఊహించని ఎనర్జిటిక్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఆద్యంతం ఉత్కంఠగా సాగింది.  వెంకటేష్ తనదైన శైలిలో నవ్విస్తూనే యాక్షన్ ఎలిమెంట్స్‌తో థ్రిల్ చేశారు. పైకి ఆదర్శ కుటుంబంగా కనిపిస్తూనే, ఆ ఫ్యామిలీ దాచిన అసలు కథ ఏంటనే ఉత్సుకతను టీజర్ అద్భుతంగా రేకెత్తించింది. వెంకటేష్ సరసన కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది.
నారా రోహిత్, నివేదా పేతురాజ్, సత్య, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, రఘుబాబు లాంటి భారీ కాస్టింగ్ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. థమన్ ఎస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్ ఎలివేషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. రవి కె. చంద్రన్ విజువల్స్, నవీన్ నూలి ఎడిటింగ్, ఏ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ సినిమా స్థాయిని చాటిచెబుతున్నాయి.  త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్నో బ్లాక్ బస్టర్స్ తెరకెక్కించిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం బాధ్యతలను త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వయంగా భుజాన వేసుకుని చెక్కిన ఈ అచ్చమైన తెలుగు సినిమా అక్టోబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. వినోదానికి యాక్షన్ జోడించి బాక్సాఫీస్ వద్ద దద్దరిల్లే రేంజ్ హిట్టు కొట్టేందుకు వెంకీ-త్రివిక్రమ్ సిద్ధమయ్యారు.