దర్శకుడు వీరభద్రం చౌదరి కొంతకాలంగా ఏటికి ఎదురీదుతున్నారు. అనుకున్న ప్రాజెక్టులేవీ అనుకున్న విధంగా పట్టాలు ఎక్కలేదు. మొదలైన కొన్ని సినిమాలు పూర్తి కాకుండానే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో వీరభద్రం చౌదరి దర్శకత్వంలో నరేశ్ అగస్త్య హీరోగా నబీ షేక్, తూము నర్సింహ పటేల్ ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. జామి శ్రీనివాసరావు సహ నిర్మాతగా వ్యవహరించే ఈ చిత్రానికి అనిల్ రెడ్డి సమర్పకులు.
ఈ మూవీ గురించి నిర్మాతలు మాట్లాడుతూ, ”దర్శకులు వీరభద్రం చౌదరితో మా మొదటి సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. ఆయన ఓ అద్భుతమైన కథ చెప్పారు. కథ వినగానే మరో ఆలోచన లేకుండా, ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నాం. జూలై నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలని త్వరలోనే వెల్లడిస్తాం” అని అన్నారు. ‘పూలరంగడు’తో సూపర్ హిట్ అందుకున్న వీరభద్రం చౌదరి; ‘సేనాపతి’ మూవీతో నటుడిగా చక్కని ప్రశంసలు అందుకున్న నరేశ్ అగస్త్య కాంబోలో తెరకెక్కుతున్న ఈ క్రైమ్ కామెడీ జానర్ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. గతంలో ‘పూలరంగడు’కు కూడా అనూపే సంగీతం అందించడం విశేషం.